అంతర్జాతీయంక్రీడలు

ప్రపంచకప్‌ 2019: పది జట్లు.. కెప్టెన్ల విశేషాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ టోర్నీకి అన్ని జట్లు సమాయత్తమతున్నాయి. ఈ సారి పాల్గొనే పది జట్లలో ఏడుగురు కెప్టెన్లు తొలిసారి ప్రపంచకప్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, వెస్టిండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌, బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మష్రఫే మోర్తాజా ఇదివరకు మెగా ఈవెంట్‌లో సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. ఇక మిగిలిన భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌ ఏడు జట్ల కెప్టెన్లు తొలిసారి ప్రపంచకప్‌లో సారథ్య బాధ్యతలు చేపడుతున్నారు. మరి ఆ కెప్టెన్ల విశేషాలు ఒకసారి పరిశీలిస్తే..

టీమిండియా- విరాట్‌ కోహ్లీ

విరాట్‌ కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో సంచలన బ్యాట్స్‌మెన్‌. ఇక టీమిండియా కెప్టెన్‌గానూ విజయవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడి సారథ్యంలో భారత జట్టు ఇప్పటివరకూ 68 వన్డేల్లో 49 మ్యాచ్‌లు(73.88 విజయశాతం) గెలిచింది. కాగా, 2017లో ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీలో కోహ్లీ కెప్టెన్‌గా భారత్ బరిలోకి దిగింది. అయితే ఆ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌.. పాక్‌ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈసారి భారత జట్టు ప్రపంచకప్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉంది.


పాకిస్థాన్‌- సర్ఫరాజ్‌ అహ్మద్‌

సర్ఫరాజ్‌ సారథ్యంలో పాకిస్థాన్‌ జట్టు బలంగా కనిపిస్తోంది. 35 మ్యాచుల్లో 21 విజయాలు (61.76 విజయశాతం) నమోదు చేశాడు. ఆ జట్టు తరఫున సర్ఫరాజ్‌ కీలక పాత్ర పోషించనున్నాడు. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా, వికెట్‌కీపర్‌గానూ తన ప్రతిభని చాటుతున్నాడు. కాగా 2017 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ను విజేతగా నిలిపాడు.


ఇంగ్లాండ్‌- ఇయాన్‌ మోర్గాన్‌

ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలో ఇంగ్లాండ్‌ టాప్‌ ఫేవరెట్‌ జట్టుగా మారింది. 2015 ప్రపంచకప్‌లో ఈ జట్టు గ్రూప్‌ దశ నుంచే వైదొలగిన సంగతి తెలిసిందే. అనంతరం మోర్గాన్‌ జట్టు పగ్గాలు అందుకొని 76 మ్యాచుల్లో 50 విజయాలు నమోదు చేశాడు. అలాగే వన్డే ర్యాంకింగ్స్‌లోనూ తొలి స్థానానికి తీసుకెళ్లాడు. దీంతో ఈసారి ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగడంతో పాటు సొంతగడ్డపై తొలిసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది.


ఆస్ట్రేలియా- ఆరోన్‌ ఫించ్‌

కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును ఆరోన్‌ ఫించ్‌ ఆదుకుంటున్నాడు. 2018 అక్టోబర్‌లో సారథ్య బాధ్యతలు అందుకున్న ఫించ్‌ 18 వన్డేల్లో 10 (56 విజయశాతం) మ్యాచ్‌లు గెలిపించాడు. కెప్టెన్‌గా మారాక బ్యాటింగ్‌ ఫామ్‌ కోల్పోయినా ఇటీవల పాకిస్థాన్‌ సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిపోయాడు. మరోవైపు ఏడాది పాటు జట్టుకు దూరమైన డేవిడ్‌వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ తిరిగి చేరడంతో ఆసీస్‌ బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వార్నర్‌ ఐపీఎల్‌లో తన బ్యాటింగ్ స్టామినా ఎంతో తెలియజేశాడు.


బంగ్లాదేశ్‌- మష్రఫే మోర్తాజా

బంగ్లాదేశ్‌ తరఫున అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడు మష్రఫే మోర్తాజా. రెండోసారి ప్రపంచకప్‌ ఈవెంట్‌లో సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కాగా 2015 ప్రపంచకప్‌లో గ్రూప్‌ ఏ తరఫున ఇంగ్లాండ, అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌ జట్లని వెనక్కినెట్టి క్వార్టర్‌ఫైనల్‌కి తీసుకెళ్లాడు. భారత్‌ చేతిలో ఓటమిపాలవ్వడంతో బంగ్లా అక్కడి నుంచి నిష్క్రమించింది. మొత్తంగా అతడి కెప్టెన్సీలో 73 వన్డేల్లో 40 మ్యాచులు బంగ్లా గెలుపొందింది.


దక్షిణాఫ్రికా- ఫా డు ప్లెసిస్‌

దక్షిణాఫ్రికా జట్టు  డుప్లెసిస్‌ సారథ్యంలో బాగా మెరుగైంది. అతడో విజయవంతమైన కెప్టెన్‌గా నిలబడ్డాడు. ఎందుకంటే అతడి కెప్టెన్సీలో ఆ జట్టు 30 మ్యాచ్‌ల్లో ఐదు మాత్రమే ఓటమిపాలైంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఈసారి పటిష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో అతడి సగటు 46.54గా నమోదైంది. ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో ఉన్న జట్లలో ఇదీ ఒకటి.


శ్రీలంక- దిముత్‌ కరుణరత్నే

ఈసారి ప్రపంచకప్‌లో అత్యంత బలహీన జట్లలో శ్రీలంక ఒకటి. అలాంటి జట్టుకు దిముత్‌ కరుణరత్నే  కెప్టెన్‌ బాధ్యతలు నిర్వర్తించబోతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై శ్రీలంక టెస్టు సిరీస్‌ను(2-0)తో క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇతడి సారథ్యంలోనే ఆ ఘనత సాధించింది. అయితే కరుణరత్నే ఇప్పటివరకూ వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించకపోవడం గమనార్హం. మరో విశేషమేంటంటే.. 2015 మార్చిలో అతడు చివరిసారి వన్డే మ్యాచ్‌ ఆడటం. కాగా ఆడిన 17 మ్యాచుల్లో  16 కన్నా తక్కువ సగటుతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు.


వెస్టిండీస్‌- జాసన్‌ హోల్డర్‌

వెస్టిండీస్‌ సారథిగా జాసన్‌ హోల్డర్‌ బాధ్యతలు తీసుకున్నాడు. 2014 నుంచి ఒక్కటి కూడా ద్వైపాక్షిక సిరీస్‌ గెలవలేని జట్టు ఇటీవల అతడి సారథ్యంలో ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపై మట్టికరిపించింది. 1975, 1979 ప్రపంచకప్‌ గెలిపించిన క్లైవ్‌ల్లాయిడ్‌ను ఆదర్శంగా తీసుకొని జాసన్‌ ఈసారి జట్టుని ముందుండి నడిపించనున్నాడు. ఇదిలా ఉండగా జాసన్‌ ఈ సీజన్‌లో అందరి కెప్టెన్ల కంటే వయసులో చిన్నవాడు.


న్యూజిలాండ్‌- కేన్‌ విలియమ్సన్‌

2015 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ జట్టులో కేన్‌ విలియమ్సన్‌ ఒక సభ్యుడిగా ఉన్నాడు. అప్పటి కెప్టెన్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ ఆధ్వర్యంలో విలియమ్సన్‌ బాగా రాణించాడు. అనంతరం కెప్టెన్‌గా మారి న్యూజిలాండ్‌ జట్టుకి విజయవంతమైన నాయకుడిగా మారాడు. 53.96 విజయశాతంతో జట్టుని ముందుకు నడిపిస్తున్నాడు. కాగా ఇటీవల గాయం బారిన విలియమ్సన్‌ ప్రపంచకప్‌లో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.


అఫ్గానిస్థాన్‌- గుల్బాడిన్‌ నైబ్‌

అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ గుల్బాడిన్‌ నైబ్‌ తొలిసారి ప్రపంచకప్‌ ఆడటంతో పాటు అంతర్జాతీయ ఈవెంట్‌లో మొదటిసారి పాల్గొంటున్నాడు. గతంలో ఇతడికి కెప్టెన్‌ అనుభవం లేనప్పటికీ ఆ జట్టు యాజమాన్యం ఇటీవల కెప్టెన్‌గా నియమించింది. 52 వన్డేల్లో 807 పరుగులు, 40 వికెట్లు తీయడంతో అతడిని అఫ్గాన్‌ కెప్టెన్‌గా నియమించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా అఫ్గాన్‌ జట్టులో ప్రముఖ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌ ఉన్నాడు.