జాతీయం

ప్రత్యర్థులు కలిసిన వేళ

ఎన్నికల రణరంగంలో నువ్వా నేనా అన్నట్లు తలపడి, ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ బుధవారం సమావేశమయ్యారు. మరో ఎనిమిది నెలల్లో దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ సమయంలో ఆమె వెంట కొంతమంది కాంగ్రెస్‌ నాయకులు కూడా ఉన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి ఇంట్లో సమావేశమైన వారు దేశ రాజధానిలో నెలకొన్న కరెంటు, నీటి సమస్యలపై చర్చించారు. దిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న కరెంటు సమస్యలు తీర్చకుండా, ప్రజలను మభ్యపెడుతుందంటూ  కేజ్రీవాల్‌ ప్రభుత్వం మీద షీలా దీక్షిత్ గత శనివారం విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఆరు నెలల కాలానికి ప్రజల కరెంటు బిల్లులు మాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలాను గద్దె దింపి, 2013లో అరవింద్ కేజ్రీవాల్ దిల్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దిల్లీలో పొత్తు కోసం కాంగ్రెస్‌, ఆప్‌ మధ్య అనేక తర్జనభర్జనలు జరిగి చివరకు ఎలాంటి పొత్తు లేకుండా ఇరు పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. అయితే భాజపా దేశ రాజధానిలోని ఏడు పార్లమెంటరీ స్థానాలు గెలుచుకొని, విజయ ఢంకా మోగించింది.