జాతీయం

పోలింగ్‌ కేంద్రం సమీపంలో బాంబు పేలుడు

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పోలింగ్‌ కేంద్రం సమీపంలో ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. అయితే భద్రతాసిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు. నారాయణ్‌పూర్‌ జిల్లాలో ఉదయం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నారాయణ్‌పూర్‌.. బస్తర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో నేడు పోలింగ్‌ జరుగుతోంది. అయితే రాయణ్‌పూర్‌-దంద్వాన్‌ రోడ్డులోని ఓ పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో మావోయిస్టులు ఐఈడీ బాంబు అమర్చారు. పోలింగ్‌ భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని నక్సల్స్‌ ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే మావోయిస్టుల ముప్పును ముందుగానే ఊహించిన భద్రతాసిబ్బంది చివరి నిమిషంలో తమ మార్గాన్ని మార్చుకున్నారు. రోడ్డుపై కాకుండా అటవీమార్గం గుండా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న నక్సల్స్‌ ఐఈడీని పేల్చి అక్కడి నుంచి పరారయ్యారు. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో  వ్యవహరించడంతో ఎటువంటి  ప్రాణహానీ జరగలేదు.

బస్తర్‌ నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు 80వేల మంది రాష్ట్ర, పారామిలటరీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు.