క్రైమ్

పొరుగు దేశంలో వేలుపెట్టిన అమెరికా..!

ఇంటర్నెట్‌డెస్క్‌: పెట్రో దేశమైన వెనెజువెలాలో భయంకరమైన తిరుగుబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నామని అధ్యక్షుడు నికోలస్‌ మదురో ప్రకటించారు. గత కొన్ని నెలలుగా వెనెజువెలాలో రాజకీయ, భద్రతా పరిస్థితులు క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు జువాన్‌ గుయుడో కొన్ని గంటల క్రితం దేశప్రజలనుద్దేశించి మాట్లాడుతూ నికోలస్‌ మదురోను గద్దె దింపేందుకు పోరాడలని పిలుపు నిచ్చారు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. రాజధాని కారకస్‌లోని ఒక సైనిక కార్యలయం ఎదుట వీరంతా పోగయ్యారు. ఈ క్రమంలో సైన్యం కూడా తమకు మద్దతు ఇవ్వాలని గుయుడో కోరారు. కానీ సైన్యం దీనిని పట్టించుకోలేదు. తాము మదరో వెనుకే ఉన్నామని జనరల్‌ వ్లాదిమిర్‌ పద్రినో  ప్రకటించారు.
అమెరికా జోక్యం..
వెనెజువెలా అంతర్గత వ్యవహారంలో అమెరికా జోక్యం చేసుకొంది. ట్రంప్‌ కార్యవర్గం గుయుడోకు పూర్తి మద్దతుగా నిలిచింది. ఈ మేరకు ట్వీట్లు కూడా చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ నేరుగా ఒక ప్రకటన చేశారు. వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్‌ పద్రినో, సుప్రీం కోర్టు చీఫ్‌ మిఖాయిల్‌ మొరెనో, ప్రెసిడెన్షియల్‌ గార్డ్స్‌ చీఫ్‌ ఇవాన్‌ రఫేల్‌ హర్నాండెజ్‌ డాలాలు ప్రతిపక్ష నేతకు మద్దతు ఇచ్చి ఆ దేశంలో శాంతిని కాపాడాలని కోరారు. వెనెజువెలా పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతి నిమిషం పర్యవేక్షిస్తున్నారని బోల్ట్‌ వెల్లడించారు.  కానీ ఈ విజ్ఞప్తులను వారు పట్టించుకోలేదు.
కుట్ర దెబ్బతిన్నది ఇలా..
గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష నేత గుయుడో అమెరికాతో టచ్‌లో ఉన్నారు. కానీ చివరి నిమిషంలో అమెరికా నుంచి గుయుడోకు అనుకున్న స్థాయిలో సహాయ సహకారాలు లభించలేదు. దీంతో ఈ తిరుగుబాటును.. అధ్యక్షుడు మదురోకు మద్దుతుగా ఉన్న సైన్యం అణచి వేసింది.
52 మందికి గాయాలు..
తిరుగుబాటు యత్నం సందర్భంగా చెలరేగిన హింసలో దాదాపు 52 మంది గాయపడ్డారు. వీరిలో 32 మంది రబ్బర్‌ బుల్లెట్ల వల్ల గాయపడ్డారు.

వివాదం మొదలైంది ఇక్కడ..
వెనెజువెలా దేశంలో తానే దేశ అధ్యక్షుడునని ప్రతిపక్ష నేత జువాన్‌ గుయాడో (35) రాజధాని కారకస్‌లో ప్రజల సమక్షంలో కొన్నాళ్ల కిందట ప్రకటించుకున్నారు. అధ్యక్షునిగా ఆయనను గుర్తిస్తున్నట్టు అమెరికాతో పాటు, పొరుగుదేశాలైన బ్రెజిల్‌, కొలంబియా, పెరు, అర్జెంటినాలు ప్రకటించాయి. అయితే ఈ చర్యను రష్యా, క్యూబా, టర్కీ వంటి దేశాలు ఖండించాయి. అధ్యక్షుడు నికోలస్‌ మదురోకే మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరగాలని ఐక్యరాజ్య సమితి సూచించగా, తాజాగా ఎన్నికలు జరపడమే మేలని యూరోపియన్‌ యూనియన్‌ అభిప్రాయపడింది. చమురు నిల్వలు అధికంగా ఉన్న దేశం అయినప్పటికీ మదురో పాలనలో వెనెజువెలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయన సైన్యం, రష్యా సహకారంతో పాలన కొనసాగిస్తున్నారు. పరిస్థితులను గమనించిన విపక్ష నేత గుయాడో తనను తాను అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. అది జరిగిన కొన్ని నిమిషాల్లోనే ఆయనను దేశ తాత్కాలిక నేతగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటన విడుదల చేశారు. దీనికి బదులుగా అమెరికాతో దౌత్య సంబంధాలను రద్దు చేస్తున్నట్టు అధ్యక్షుడు మదురో తెలిపారు. అయితే మాజీ అధ్యక్షునిగా మారినందున ఆయనకు ఆ అధికారం లేదని అమెరికా తిప్పికొట్టింది. వెనెజువెలా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపించింది.
బంగారు యుద్ధం..
జనవరి 26 తేదీన వెనెజువెలా ప్రభుత్వం నిల్వ చేసిన బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు ది బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ నిరాకరించింది. ఈ విషయాన్ని అప్పట్లో బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. వెనెజువెలా వద్ద కేవలం 8 బిలియన్‌ డాలర్లు మాత్రమే రిజర్వులు ఉన్నాయి. వీటిల్లో 1.2బిలియన్‌ డాలర్ల బంగారం కూడా కీలక భాగమే. అమెరికా అధికారుల కోరిక మేరకే బ్రిటన్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇక్కడ నికోలస్‌ మదురో తన అధికారాన్ని నిరూపించుకోవాల్సిన  పరిస్థితి తలెత్తింది.
సిటీ గ్రూప్‌ తాకట్టులో ఉన్న వెనెజువెలా  బంగారం వేలానికి వచ్చే అవకాశం ఏర్పడింది. ఇక్కడ కొన్ని టన్నుల బంగారాన్ని కుదువ పెట్టి వెనెజువెలా ప్రభుత్వం 1.6 బిలియన్‌ డాలర్లను రుణంగా తీసుకొంది. ఇటీవల చెల్లింపు గడువు దాటడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఫలితంగా వెనెజువెలా రిజర్వులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది.

రష్యా రాక..

కొన్ని వారాల క్రితమే రష్యా సేనలు వెనెజువెలాలో కాలుమోపాయి. దీంతో పరిస్థితి మరింత క్షీణించింది. రష్యాకు ఇక్కడ భారీగా పెట్టుబడులు ఉండటంతో వాటిని రక్షించుకొనేందుకు మదురో అధికారంలో ఉండటం చాలా ముఖ్యం. అమెరికా మద్దతు ఉన్న గుయుడో అధికారంలో వస్తే కష్టాలు తప్పవని భావించింది.  దీంతో మదురో సర్కారును ఎట్టి పరిస్థితుల్లో గద్దె దింపాలని ట్రంప్ కృతనిశ్చయంతో ప్రయత్నాలను తీవ్రం చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగమే నేటి తిరుగుబాటు యత్నం.