క్రైమ్తెలంగాణ

పెళ్లి చేసుకొని కులం పేరుతో దూషణ

రంగారెడ్డి జిల్లా కోర్టులు: ప్రేమించి పెళ్లి చేసుకొని కాపురం పెట్టి ఆపై పెద్దల ముందు భార్యగా స్వీకరించడానికి నిరాకరించి కులం పేరుతో దూషించిన నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగారం, రూ.2,500 జరిమానా, బంధువులు ముగ్గురికి ఆర్నెల్ల చొప్పున జైలుశిక్ష విధించింది. అదనపు పీపీ గంగారెడ్డి కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా కల్హెర్‌ మండలం ఫతేనగర్‌కు చెందిన గంగుల రవీందర్‌ 2012లో కూకట్‌పల్లిలోని ఓ ఫర్నీచర్‌ దుకాణంలో ఆటో ట్రాలీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అదే దుకాణంలో ఉద్యోగం చేసే ఓ యువతి(19)ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం జగద్గిరిగుట్టలో కాపురం పెట్టాడు. రవీందర్‌ కుటుంబ సభ్యులను పరిచయం చేసి వారి ముందు భార్యగా స్వీకరించాలని ఆమె కోరగా అతడు నిరాకరించాడు. బెదిరించి కులం పేరుతో ఆమెను దూషించాడు. 2013లో ఓరోజు రవీందర్‌ సోదరులు రామగొండ, లక్ష్మణ్‌, అతని మామ పీరన్న వచ్చారు. పెళ్లి విషయం తెలుసుకొని రవీందర్‌తోపాటు ఆ ముగ్గురు కూడా ఆమెను కులం పేరుతో దూషించి గర్భవతి అని తెలిసి కాళ్లతో తన్ని బయటకు వెళ్లగొట్టారు. అనంతరం ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండుకు తరలించారు. రంగారెడ్డి జిల్లాలో అట్రాసిటి కేసులను విచారించే ప్రత్యేక సెషన్స్‌ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.