అంతర్జాతీయం

పెద్ద మనసు చాటుకున్న అమెజాన్ సీఈవో

న్యూయార్క్ (స్నేహ టీవీ ) : ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అవతరించిన అమెజాన్ సీఈవో జెఫ్ బిజోస్ తన పెద్ద మనసు చాటుకున్నారు. తన సతీమణి మాక్‌కెంజీతో కలిసి 2 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాయం చేయడంతో పాటు, పేద కుటుంబాల్లోని చిన్నారులకు ప్రీస్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘‘బిజోస్ డే వన్ ఫండ్’’గా పేరుపెట్టారు.
పేద కుటుంబాల అత్యవసరాలను తీర్చేందుకు, నీడ కల్పించేందుకు అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థలకు ఈ నిధులతో ప్రతియేటా అవార్డులు అందజేస్తామని బిజోస్ ట్విటర్లో పేర్కొన్నారు. మాంటిస్సోరీ స్ఫూర్తితో నడుస్తున్న ప్రీస్కూళ్లలో పేద పిల్లలకు పూర్తి స్కాలర్‌షిప్ కూడా అందిస్తామన్నారు. అమెజాన్, వాషింగ్టన్ పోస్ట్‌తో పాటు అంతరిక్ష అన్వేషణ సంస్థ బ్లూ ఆరిజిన్‌కు అధిపతిగా ఉన్న బిజోస్… ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు నెలకొల్పారు. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం ఆయన ఆస్తి విలువ మొత్తం 164 బిలియన్ డాలర్లు.