అంతర్జాతీయం

పుల్వామాలో జవాన్లపై మరో దాడి

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డారు. పుల్వామాలో ఎస్‌బీఐ బ్రాంచి సమీపంలో ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ దాడిలో కొందరు జవాన్లకు గాయాలయ్యాయని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అక్కడి అధికారులు తెలియజేశారు. 182 బెటాలియన్‌ జవాన్లు ప్రయాణిస్తున్న బంకర్‌పై ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అనంతరం అక్కడికి సమీపంలోని అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. పుల్వామాలోనే మరోదాడి జరగడంతో పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని మరోసారి జల్లెడ పట్టే అవకాశాలున్నాయి.