జాతీయం

‘పాక్‌ మద్దతుతో ఓడించాలని చూస్తున్నారు’

దిల్లీ: మోదీయే మరోసారి ప్రధాని కావాలంటూ ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ..ఇది కాంగ్రెస్‌ పార్టీ కుట్రల్లో భాగమేనని ఆరోపించారు. ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్‌ఐకి బుధవారం ఇచ్చిన ముఖాముఖిలో ఎన్నికల సందర్భంగా చర్చనీయాంశంగా మారిన పలు అంశాలపై ఆమె స్పందించారు. ‘‘అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారో తెలియదు. మోదీని గద్దె దించడం కోసం కాంగ్రెస్‌లోని ప్రముఖ నాయకులు పాకిస్థాన్‌కు వెళ్లి వారి మద్దతు కోరుతున్నారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కాంగ్రెస్‌ పథకాల్లో ఇది కూడా ఒక భాగమేనేమో అనిపిస్తోంది’’ అని సీతారామన్‌ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ..తిరిగి మోదీ ప్రధాని అయితేనే భారత్‌తో చర్చలకు మెరుగైన అవకాశాలు ఉంటాయని ఇమ్రాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే.

అలాగే ఇటీవల తీవ్ర దుమారం రేపుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై కూడా ఆమె స్పందించారు. మహిళలపై నాయకులు విమర్శలు చేసే ముందు కాస్త జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. కనీస ఆలోచన లేకుండా మాట్లాడడం తగదని హితవు పలికారు. రామ్‌పూర్‌ భాజపా అభ్యర్థి జయప్రదపై ఆజంఖాన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ ఆమె ఈవిధంగా స్పందించారు. పార్టీలకతీతంగా నాయకుల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సూచించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేయాలని అభిప్రాయపడ్డారు.

సైన్యాన్ని, సైనిక కార్యకలాపాలను రాజకీయం చెయ్యొద్దంటూ రాష్ట్రపతికి మాజీ సైనికాధికారులు లేఖ రాశారని వచ్చిన వార్తలపై కూడా సీతారామన్‌ మాట్లాడారు. లేఖలో సంతకం చేసినట్లు పేర్కొన్న అనేక మంది అధికారులు ఆ వార్తను ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో ఆ లేఖకు ఎటువంటి విశ్వసనీయతా లేదని అర్థమైందన్నారు. సైన్యాన్ని రాజకీయం చేయడాన్ని తానూ వ్యతిరేకిస్తానన్నారు. కానీ బాలాకోట్ లాంటి కఠిన నిర్ణయాలు ప్రభుత్వ ఘనతగా చెప్పుకోవడంలో ఎలాంటి రాజకీయం లేదని అభిప్రాయపడ్డారు. అలాగే బాలాకోట్ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్థాన్‌ ఇప్పటికీ బుకాయిస్తోందన్నారు. దాడి జరిగిన ప్రాంతానికి మీడియాను తీసుకెళ్లడానికి పాక్‌కు 40 రోజులు పట్టిందని..ఈ పర్యటనలో పాత్రికేయులను పాక్‌ ఆర్మీ తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిందన్నారు.