జాతీయం

పాక్‌ గగనతలం మీదుగా ప్రధాని పర్యటించట్లేదు

కిర్గిజిస్థాన్‌లో 13, 14న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌(ఎస్‌సీఓ) సదస్సుకు ప్రధాని మోదీ పాకిస్థాన్ మీదుగా వెళ్లడం లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి  పాకిస్థాన్‌ అనుమతించిందన్న వార్తలకు ఈ ప్రకటనతో తెర పడింది. కిర్గిగిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగే ఎస్‌సీఓ సదస్సుకు ప్రధాని ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్న ప్రశ్నకు విదేశాంగ శాఖ ప్రతినిధి బుధవారం సమాధానమిచ్చినట్లు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ‘బిష్కెక్‌ వెళ్లాల్సిన వీవీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం  రెండు మార్గాలను ఎంచుకుంది. ఇప్పుడు ఆ విమానం ఒమన్‌, ఇరాన్‌, మధ్యఆసియా దేశాల మీదుగా బిష్కెక్‌కు చేరుకుంటుంది’ అని ఆ ప్రతినిధి పేర్కొన్నారు.
దేశాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిన పుల్వామా ఉగ్ర ఘటనకు ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరాల మీద బాంబుల వర్షం కురిపించింది. అప్పటి నుంచి పాకిస్థాన్‌ తన గగనతలాన్ని మూసివేసింది. అయితే భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు మోదీ విమానం పాక్‌ గగనతలం మీదుగా ప్రయాణించడానికి అనుమతించినట్లు కొద్ది రోజుల క్రితం ఓ వార్తా ఏజెన్సీ వెల్లడించిన సంగతి తెలిసిందే.