జాతీయం

పాక్‌కు అంత దమ్ము లేదు: ఆర్మీ చీఫ్‌

1999 నాటి కార్గిల్‌ చొరబాట్ల మాదిరిగా నేడు భారతదేశంలో ప్రవేశించే అంత దమ్ము పాక్‌కు లేదని ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ తెలిపారు. శుక్రవారం దిల్లీ కంటోన్మెంట్‌లోని మానేక్‌షా సెంటర్‌లో నాటి కార్గిల్‌ యుద్ధంలో చేపట్టిన ‘ఆపరేషన్‌ విజయ్‌’ 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకుగానూ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  మీడియా ప్రతినిధులు  మళ్లీ కార్గిల్‌ మాదిరి చొరబాట్లకు అవకాశం ఉందా అని ఆయనను ప్రశ్నించారు. అందుకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూసుకున్నట్లయితే అన్ని సరిహద్దు ప్రాంతాల్లోనూ మన సైనికులు కట్టుదిట్టంగా పహారా కాస్తున్నారు. అందువల్ల నాటి కార్గల్‌ చొరబాట్ల మాదిరిగా మన భూభాగంలోకి  ప్రవేశించేంత ధైర్యం వారికి లేదని ధీమా వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో ఇండియా ఆర్మీపై చేసిన ఒక ప్రత్యేక వీడియో పాటను విడుదల చేశారు. బాలీవుడ్‌ రచయిత సమీర్‌ ఈ గీతాన్ని రాశారు. ఇందులో అమితాబ్‌బచ్చన్‌తో పాటు మరికొందరు బాలీవుడ్‌ నటులు నటించారు. కార్గిల్‌ యుద్ధవీరులకు ఈ వీడియోను అంకితం చేశారు.