అంతర్జాతీయం

పాకిస్థాన్‌కు వార్నింగ్‌ ఇచ్చాం: మోదీ

గాంధీనగర్‌: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడి చేసిన అనంతరం ఆ దేశ సైన్యానికి చిక్కిన ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌‌ అభినందన్‌కు ఏమైనా జరిగితే తాము పాక్‌ను వదలబోమని హెచ్చరించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గుజరాత్‌లోని పాఠణ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘పాక్‌ యుద్ధ విమానాన్ని మనం కూల్చేశాం. మన పైలట్‌ను పాక్‌ అదుపులోకి తీసుకుంది. మన పైలట్‌కు చిన్న గాయం అయినా గట్టిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం’  అని వ్యాఖ్యానించారు. కాగా, శాంతికి సందేశంగా తాము అభినందన్‌ను విడుదల చేస్తున్నామని పాక్‌ తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అభినందన్‌ మళ్లీ విధుల్లో చేరారు.

గుజరాత్‌లో మరోసారి భాజపాను 26 స్థానాల్లోనూ గెలిపించాలని మోదీ కోరారు. ‘రాష్ట్రంలోని అన్ని సీట్లలో భాజపాను గెలిపించండి. కేంద్రంలో తిరిగి భాజపా ప్రభుత్వమే ఏర్పడుతుంది. కానీ, గుజరాత్‌లో 26 సీట్లను భాజపా గెలుచుకోకపోతే, మే 23న ఈ విషయంపై టీవీల్లో చర్చలు చేపడతారు. ఎందుకిలా జరిగిందంటూ చర్చలు జరుపుతారు. నేను ఉత్తర్‌ప్రదేశ్‌లో దళితుల కాళ్లు కడిగిన విషయం అమెరికా వార్తా పత్రికల్లోనూ వచ్చింది. మహాత్మాగాంధీ ఆలోచనలే మా విధానాలుగా ఉన్నాయి. 2022 కల్లా దేశంలోని అందరికీ సొంతిళ్లు ఉండాలన్నదే నా లక్ష్యం’ అని వ్యాఖ్యానించారు. కాగా, మూడోదశ ఎన్నికల్లో భాగంగా మే 23న గుజరాత్‌లోని 26 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నేటితో ప్రచారం ముగియనుంది.