తెలంగాణ

పవర్‌ప్లాంట్‌ పనుల్ని పరిశీలించిన కేసీఆర్‌

రామగుండం: రామగుండంలోని ఎన్టీపీసీ పవర్‌ప్లాంట్‌ వద్దకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ఆయన తొలుత పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ ఎన్టీపీసీ సీఎండీ గుర్‌దీప్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం రామగుండంలో కొత్తగా 1600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న పవర్‌ ప్లాంట్‌ వద్దకు చేరుకొని పనుల్లో పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుర్‌దీప్‌ సింగ్‌తో కలిసి ఆయన పవర్‌ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ వెంట సీఎస్‌ ఎస్కే జోషీ, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

ఈ రాత్రికి కరీంనగర్‌లోనే సీఎం బస చేయనున్న ముఖ్యమంత్రి.. ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. జులైలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఆ దిశగా పనుల పురోగతి, ఇతర అంశాలపై అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.