తెలంగాణ

పవన్‌..విద్వేషాలు రెచ్చగొడతారెందుకు?:పోసాని

హైదరాబాద్‌ : ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై  సినీనటుడు పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఏపీలో ఓట్ల కోసం హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లను కొడుతున్నారంటూ పవన్‌ వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పోసాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో దెబ్బలు తిని ఆంధ్రాకు పారిపోయిన వాళ్లను చూపించాలని పవన్‌ను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని.. ఆంధ్రావాళ్లని ఎవరు కొట్టారో, ఎవరు ఆంధ్రాకు పారిపోయారో రుజువులు చూపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాను కూడా హైదరాబాద్‌లోనే బతుకుతున్నానని.. పవన్‌ రుజువులు చూపిస్తే తాను కూడా పారిపోయి ఆంధ్రాకు వస్తానని చెప్పారు. కేసీఆర్‌ ఎవరి భూములు లాక్కుంటున్నారో పవన్‌ చెప్పాలని నిలదీశారు.

‘నేను 1984 నుంచి హైదరాబాద్‌లో ఉంటున్నా.. తెలంగాణ మొత్తం తిరిగా. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను విమర్శిస్తూ వ్యాసాలు రాసా. అయితే ఏ ఒక్క తెలంగాణ బిడ్డ నన్ను కొట్టలేదు. నా ఇంటర్వ్యూ చూసి కేసీఆర్‌ కూడా లైట్‌ తీసుకున్నారు.’ అని పోసాని తెలిపారు. తెలుగువాళ్ల మధ్య ఎందుకు విద్వేషాలు రెచ్చగొడతారు? అని పవన్‌ను ప్రశ్నించారు. ఇదే పవన్‌ గతంలో కేసీఆర్‌ను ఆంధ్రా నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని పొగిడారని గుర్తుచేశారు. ఆంధ్రాలో ఓట్ల కోసం ఇప్పుడు మాటమారుస్తావా? అంటూ పోసాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.