సినిమా

పవన్‌ మావయ్య బైక్‌పై ఆఫీసుల చుట్టూ తిరిగా

హైదరాబాద్‌: సినిమా అవకాశాల కోసం పవన్‌ మావయ్య బైక్‌పై ఆఫీసుల చుట్టూ తిరిగేవాడినని అంటున్నారు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ‘చిత్రలహరి’ సినిమా మంచి విజయం అందుకుంది. చాలా కాలం తర్వాత ధరమ్‌కు దక్కిన విజయమిది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ధరమ్‌ పవన్‌ కల్యాణ్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
‘‘చిరంజీవి మావయ్య సినిమాలతో చాలా బిజీగా ఉండేవారు. దాంతో ఆయనతో ఎక్కువగా సమయం గడపలేక పోయేవాళ్లం. ఆ సమయంలో పవన్‌ మావయ్య మాతో ఆడుకునేవారు. మమ్మల్ని బయటికి తీసుకెళ్లి బొమ్మలు కొనిచ్చేవారు. నన్ను సినిమాను కెరీర్‌గా ఎంచుకోమంది కూడా ఆయనే. పవన్‌ మావయ్య బైక్‌ వేసుకుని అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. కానీ నాకు ఎవ్వరూ అవకాశాలు ఇచ్చేవారు కాదు’’ అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
‘చిత్రలహరి’ సినిమా సక్సెస్‌ అయినప్పుడు పవన్‌.. ధరమ్‌ను మెచ్చుకున్నారు. ఎంతో కాలంగా సరైన హిట్లు లేక బాధపడుతున్న ధరమ్‌కు.. ‘‘ఖుషి’ సినిమా తర్వాత మంచి విజయం కోసం నేనూ ఇలానే చాలా కాలం ఎదురుచూశాను’’ అని ధైర్యం చెప్పారట. ఈ చిత్రానికి కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ కథానాయికలు.