తెలంగాణ

పదవి ఏంటనేది ముఖ్యం కాదు: రామ్‌ చరణ్

హైదరాబాద్‌: పదవి ఏంటనేది ముఖ్యం కాదని, సమాజంలో మార్పు తీసుకురావాలని ఏర్పరచుకున్న లక్ష్యం ముఖ్యమని కథానాయకుడు రామ్‌ చరణ్‌ అన్నారు. 2019 ఏపీ ఎన్నికల ఫలితాల్ని ఉద్దేశిస్తూ ఆయన శుక్రవారం ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఎన్నికల్లో తన బాబాయి పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీ కోసం పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ‘గొప్ప నాయకుడు..  నాయకుడు అనిపించుకోవాలి అనుకోడు. మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నించే వాడే నిజమైన నాయకుడు. పదవి ఏంటనేది ముఖ్యం కాదు, లక్ష్యం ఏంటనేదే ముఖ్యం. జనసేన పార్టీ, పవన్‌ కల్యాణ్‌ గారికి మద్దతుగా ఉండి, సేవ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ ఏపీ ఎన్నికలు 2019 అనే హ్యాష్‌ట్యాగ్‌ను రామ్‌ చరణ్‌ జత చేశారు.

జనసేనకు ఈ ఎన్నికల్లో తీవ్ర నిరాశే మిగిలింది. పవన్‌ కల్యాణ్‌ రెండుచోట్ల పోటీచేసి ఓటమిపాలయ్యారు. భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు గాజువాకలోనూ వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్‌ ఓడిపోయారు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.