ఆంధ్రప్రదేశ్

పక్కా ప్రణాళిక ప్రకారమే అల్లర్లు: చంద్రబాబు

అమరావతి: పోలింగ్‌ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల చోటుచేసుకున్న దాడులు అప్పటికప్పుడు జరిగినవి కావని, పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగాయని ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమమని తెలిపారు. పోలింగ్‌ జరిగిన తీరుపై ఆయన ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్‌, కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్‌తో పోరాడాల్సి వచ్చిందన్నారు. వారికున్న అధికారాలన్నీ నీచంగా ఉపయోగించారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అణగదొక్కడానికి సంకల్పించారని విమర్శించారు.

ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారని.. హింస, దౌర్జాన్యానికి పాల్పడ్డారని  చంద్రబాబు ఆరోపించారు. ఉదయం 31 శాతం ఈవీఎంలు పని చేయకపోవడంతో పాటు ఒక భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. ఒకే రోజు ఈవీఎంలు పలుసార్లు మొరాయించడంతో ప్రజలు పలుసార్లు కేంద్రాలకు తిరిగారని చెప్పారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఎండలను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

విశ్వసనీయత ఎక్కడ?
యంత్రాలు పని చేయనప్పుడు మరో ఈవీఎంను మార్చడం వంటి చర్యలకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. స్వయానా ఎన్నికల ప్రధానాధికారి ఓటేయలేని పరిస్థితి ఉంటే విశ్వసనీయత ఎక్కడుందని ప్రశ్నించారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్‌ మొదలు కాలేదని, రాత్రి 3.30 గంటలకు కూడా ఓటు వేసిన సందర్భం ఉందని చెప్పారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోలింగ్‌ కేంద్రాల వద్ద అల్లర్లు జరిగాయని, ఈ చర్యలు జరిగే అవకాశముందని ముందే హెచ్చరిస్తే రాష్ట్ర ఉన్నతాధికారులందర్నీ మార్చేశారని విమర్శించారు. ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈసీనా.. భాజపా కార్యాలయమా..?

‘‘ఆర్బీఐ గవర్నర్‌ రాజీనామా, సీబీఐ వ్యవహారం, ఐటీని ఇష్టమొచ్చినట్లు వాడుకోవడం వంటివి ఇప్పటి వరకు చూశాం. ఇప్పుడు ఈసీని భాజపా కార్యాలయం మాదిరిగా మార్చుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యమైతే ఇంతవరకూ వైకాపా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే ఎన్నికలకు మూడు రోజుల ముందు జగన్‌ ప్రచారంలో పాల్గొనకుండా సెలవులో ఉన్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఉండి కుట్రలు పన్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.