సినిమా

‘నోటా’ రివ్యూ…

తక్కువ సినిమాలతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు నటుడు విజయ్‌ దేవరకొండ. ఈ హీరో నటించిన ‘నోటా’ సినిమా శుక్రవారం సౌత్‌లో భారీ ఎత్తున రిలీజైంది. పొలిటికల్ నేప‌థ్యంతో కూడిన సినిమాల్లో నటించడానికి స్టార్ హీరోలు సైతం పెద్దగా ముందుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, విజ‌య్ దేవ‌ర‌కొండ స్టోరీల ఎంపిక‌లో తాను ప్రత్యేకమని చెబుతూ ‘నోటా’ చేశాడు. మ‌రి ఈ పిక్చర్ ద్వారా ఆయన బాక్సాఫీసు వద్ద విజయాల పరంపర కొనసాగించాడా? లేదా తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లొద్దాం..

స్టోరీ

సీఎం వాసుదేవ్ (నాజ‌ర్‌) పెద్ద కొడుకు వ‌రుణ్ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌). త‌న‌పైవున్న ఓ కోర్టు కేసు నేపథ్యంలో రాత్రికి రాత్రే ప‌ద‌వి నుంచి దిగిపోయి త‌న కొడుకు వ‌రుణ్‌ని సీఎం చేస్తాడు వాసుదేవ్‌. వరుణ్.. తన తండ్రి ఆదేశాల ప్రకారమే డమ్మీ సీఎంగా మేనేజ్ చేస్తుంటాడు. రాజ‌కీయాలంటే ఏంటో తెలియ‌ని వ‌రుణ్‌కి వ‌రుస‌గా స‌వాళ్లు ఎదుర‌వుతాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత మహేంద్ర (సత్యరాజ్) సహాయంతో ఆ సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరిస్తాడు వరుణ్. ఇంతవరకు ఓకే.. వరుణ్‌ని ఏ ఉద్దేశ్యంతో సీఎంగా ప్రకటిస్తాడు వాసుదేవ్? ప్రతిపక్షనేత మహేంద్ర.. వరుణ్‌కి ఎందుకు సాయం చేస్తాడు? యువ ముఖ్యమంత్రిగా వరుణ్ ఏమి సాధిస్తాడు? వంటి విష‌యాలను తెర‌పై చూడాల్సిందే..!

విశ్లేషణ

లీడర్, నా పేరు భరత్ వంటి సినిమాల మాదిరిగానే రాజకీయాలంటే అనుభవం లేని ఓ యువ‌కుడు అనుకోకుండా రాజ‌కీయాల్లోకి రావ‌డం, ఆపై ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను తెరకెక్కించడం మనం చూస్తూనే వున్నాం. కాకపోతే ఇందులో విజయ్ దేవరకొండ ఎలా చేశాడన్నది అసలు పాయింట్. పరిస్థితులకు అనుకూలంగా విజ‌య్ బాడీలాంగ్వేజ్ హైలైట్‌. చాలా స్టైలిష్‌గా కనిపించాడు. తన టైమింగ్‌‌తో అక్కడక్కడ తన మార్క్ కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ వరకు విజయ్ మార్క్ సూపర్. హీరోయిన్ మెహరీన్ విషయానికొస్తే.. నాలుగైదు స‌న్నివేశాల‌కే ఆమెని ప‌రిమితం చేశాడు డైరెక్టర్ ఆనంద్ శంకర్. సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్‌గా స‌త్యరాజ్‌, కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని ఆయన బాగా పండించాడు. సీఎం పాత్రలో నాజ‌ర్ న‌ట‌న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన గంభీరమైన నటనతో ఆకట్టుకోగా, ప్రియదర్శి.. హీరో ఫ్రెండ్‌గా సపోర్టింగ్ రోల్‌ చేశాడు.

ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. రాజకీయాలకు సంబంధించి మంచి స్టోరీ లైన్‌ తీసుకున్న ఆనంద్ శంకర్, దాన్ని పూర్తిస్థాయిలో కంటిన్యూ చేయలేక చేతులేత్తేశాడు. సన్నివేశాలు సాగతీయడం పక్కనబెడితే, ఇటీవల తమిళ రాజకీయాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో స్టోరీని రెడీ చేశాడు. కానీ, తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసి ఉంటే బాగుండేది. మ‌న్నార్‌గుడి మాఫియా, చెన్నై సిటీలో వర్షాల వల్ల ప్రజలు పడిన ఇబ్బందుల‌ను తెర‌పై చూపించాడు. ఆ త‌ర్వాత స‌న్నివేశాల‌ు నార్మల్‌గా వున్నాయి. స‌రైన విలనిజం లేక‌పోవ‌డం, స్వామీజీ రోల్‌ని వినియోగించుకోలేకపోవడంతో ప‌తాక స‌న్నివేశాలు ప్రేక్షకుల అంచ‌నాల‌కి త‌గ్గట్టుగానే ముగుస్తాయి. శంత‌న్‌ కృష్ణన్ కెమెరా వర్క్ బాగుంది, శ్యామ్ మ్యూజిక్ ఓకే. మొత్తానికి విజయ్ నటన బాగున్నా, సినిమా ఆకట్టుకోదు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘నోటా’ ఆకట్టుకోలేకపోయింది.