తెలంగాణ

నేనెక్కడికీ పారిపోలేదు: శివాజీ

హైదరాబాద్‌: టీవీ9 వ్యవహారానికి సంబంధించి తనపై నమోదైన కేసుపై సినీనటుడు శివాజీ తొలిసారి స్పందించారు. తానెక్కడికీ పారిపోలేదని, వడదెబ్బ తగలడం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తనకు, రవిప్రకాశ్‌కు మధ్య అగ్రిమెంట్ జరిగిందనేది వాస్తవమేనని.. కోర్టు పరిధిలో ఉన్న చిన్న సివిల్‌ కేసును కొందరు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి తనపై 100 కేసులు పెట్టినా భయపడనన్నారు. టీవీ9 షేర్లను తాను 2018 ఫిబ్రవరిలోనే కొన్నానని.. యాజమాన్యం మారింది గనుక 2019లో తన షేర్ల గురించి రవిప్రకాశ్‌తో అగ్రిమెంట్‌ రీరైట్‌ చేసుకున్నానని వివరించారు. అలంద మీడియా తనపై పెట్టింది ఓ సిల్లీ కేసు అన్నారు. తమపై పెట్టిన కేసు ఓ సివిల్‌ గొడవకు సంబంధించింది అయితే, దాన్నో క్రిమినల్‌ కేసుగా మారుస్తూ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఏబీసీఎల్‌ పత్రాల ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించారన్న ఆరోపణలతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌, శివాజీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ రవిప్రకాశ్‌, శివాజీ స్పందించలేదు. వారు విదేశాలకు పారిపోకుండా తాజాగా లుక్‌అవుట్‌ సర్క్యులర్‌ కూడా జారీ చేశారు. రవిప్రకాశ్‌, శివాజీలను పట్టుకునేందుకు  మూడు బృందాలను ఏర్పాటు చేశారు.