జాతీయం

నీరవ్‌ మోదీ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్‌ మోదీకి యూకే హై కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం మరోసారి తిరస్కరించింది. ఆయన బెయిల్ పిటిషన్‌ తిరస్కరణకు గురికావడం ఇది నాలుగో సారి. పీఎన్‌బీ‌ బ్యాంకును మోసగించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. భారత్‌ నుంచి లండన్‌కు పారిపోయి అక్కడ తలదాచుకోగా కొన్ని రోజుల క్రితం ఆయనను అక్కడి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. అవసరమైనప్పుడు అతడు లొంగిపోడేమోనన్న సంశయంతో బెయిల్‌ ఇవ్వడానికి న్యాయమూర్తి ఇంగ్రిడ్‌ సిమ్లెర్‌ నిరాకరించారు.

అలాగే, నీరవ్‌ మోదీకి బెయిల్‌ ఇస్తే విచారణ ప్రక్రియకు ఆటంకం కలగొచ్చనే సంశయాన్ని న్యాయస్థానం వ్యక్తం చేసింది. కాగా, ఆయన ఇటీవల జైలులో పరిస్థితులు నివాసయోగ్యంగా లేవని, తనకు బెయిల్‌ ఇవ్వాలని, తాను ఎలాంటి షరతులు విధించినా ఒప్పుకుంటానని బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకోగా అది కూడా తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఆయన నాలుగో సారి పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం వాదనలు ముగిశాయి. నేడు న్యాయస్థానం ఈ పిటిషన్‌పై తమ నిర్ణయాన్ని ప్రకటించింది.