జాతీయం

నిరుద్యోగం పెరిగింది : చిదంబరం

న్యూదిల్లీ: దేశంలో నిరుద్యోగం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారని, కానీ, ఈ సమస్య విపరీతంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం ఆరోపించారు. ‘పెద్దనోట్ల రద్దు తర్వాత రెండేళ్ల పాటు దేశం 50 లక్షల ఉద్యోగాలను కోల్పోయిందని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఓ నివేదికను విడుదల చేసింది. పెద్దనోట్ల రద్దు తర్వాత దేశం లక్షలాది ఉద్యోగాలను కోల్పోయిందని మరోసారి రుజువైంది. ప్రధాని మాత్రం.. భారత్‌లో నిరుద్యోగం లేదని అంటున్నారు. మన ప్రధాని ప్రపంచం మొత్తం పర్యటిస్తారు. కానీ, దేశంలోని వీధులు, చిన్న నగరాలు, గ్రామాల్లో మాత్రం పర్యటించరు. ఇదే సమస్య..’ అని ట్విటర్‌ ద్వారా విమర్శలు గుప్పించారు.

మరోవైపు, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ జరుపుతున్న సోదాల తీరును  ఖండించారు. నిరంకుశత్వంగా, పక్షపాత ధోరణితో ఇవి జరుగుతున్నాయని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులోని తూత్తుకుడి లోక్‌సభ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి, స్టాలిన్‌ సోదరి కనిమొళికి చెందిన కురింజి నగర్‌లోని నివాసం, కార్యాలయాల్లో మంగళవారం రాత్రి ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. పదిమంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో చిదంబరం స్పందిస్తూ తమిళంలో వరుస ట్వీట్లు చేశారు. ఆమె నివాసంలో ఎటువంటి నగదు పట్టుబడలేదని వార్తల్లో చూశానని ఆయన తెలిపారు. ‘ప్రతిపక్ష నేతల గురించి మాత్రమే అధికారులు రహస్య సమాచారాన్ని ఎలా అందుకుంటున్నారు? అని ప్రశ్నించారు.