క్రైమ్

నిద్రిస్తున్న చిన్నారులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌

కొత్తపల్లి(కరీంనగర్‌ గ్రామీణం): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందలలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందున్న చెట్టు కింద నిద్రిస్తున్న అన్నాచెల్లెళ్లపైకి ట్రాక్టర్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో చెల్లి మృతిచెందగా, అన్నకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కరికెళి గ్రామానికి చెందిన వలిసే యల్లప్ప, కమలవ్వ దంపతులు ఉపాధి నిమిత్తం ఎలగందలకు వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి లక్ష్మీబాయి(7), రాము(7)అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. ఈ పిల్లలిద్దరూ సోమవారం ఉదయం ఇంటి ముందున్న చెట్టు కింద నిద్రిస్తున్నారు. వీరికి సమీపంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ను డ్రైవర్ ఇసుక నింపేందకు వాగులోకి తీసుకెళ్లడం కోసం వెనక్కి తిప్పాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలైన బాలుడిని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.