తెలంగాణ

నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన ఈసీ

హైదరాబాద్‌: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం బరిలో 185 మంది అభ్యర్థులు నిలిచారు. దేశవ్యాప్తంగా ఈ నియోజకవర్గంలో ఎన్నికపై ఆసక్తి నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించలేదంటూ పసుపు, ఎర్రజొన్న రైతులు ఈ ఎన్నికల్లో నేరుగా పోటీకి దిగారు. తెరాస, భాజపా, కాంగ్రెస్‌, జనసేన, పిరమిడ్‌ పార్టీ, బహుజన్‌ ముక్తి, సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌ పార్టీలతోపాటు మరో 178 మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. తెరాస నుంచి ఎంపీ కవిత, కాంగ్రెస్‌ నుంచి మధుయాస్కీ, భాజపా నుంచి ధర్మపురి అర్వింద్‌ బరిలో ఉన్నారు. అభ్యర్థుల సంఖ్య భారీగా ఉండటంతో బ్యాలెట్‌ పద్ధతిలోనే అక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీరందరికీ ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. బరిలో ఉండే రైతుల్లో కొంతమందికి వారి నేపథ్యానికి దగ్గరగా ఉండే గుర్తులే లభించాయి. మరికొందరికి కేటాయించిన గుర్తులు కాస్త కొత్తగా కనిపించాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో పృథ్వీరాజు అనే రైతుకి ద్రాక్షగుత్తి, వై.రజితకు బెంగళూరు మిర్చి (క్యాప్సికమ్‌), ప్రశాంత్‌కు వేరుసెనగ, కాటిపెల్లి కుమార్‌కు గోబీ పువ్వు, ఏలేటి లక్ష్మారెడ్డికి ఆపిల్‌, ఆకుల హన్మాండ్లుకు పండ్ల బుట్ట, బక్కశెట్టి గంగాధర్‌కు బఠాణీలు, బండి రవీందర్‌కు బేరిపండ్లు(పియర్స్‌)ను గుర్తులుగా కేటాయించింది. అక్కిగారి నర్సయ్యకు కిచెన్‌ సింక్‌, నల్లనడ్పి ముత్తెన్నకు లేడీ పర్సు, పెంట నర్సయ్యకు చేట, అంజయ్యకు బేబీవాకర్‌, అల్లూరి లింబారెడ్డికి గాజులు, ఆస్లి గణేశ్‌కు పూసల నెక్లెస్‌, ఎడమల రవీందర్‌కు బిస్కెట్టు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.