ఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

నిఖా పేరుతో పచ్చిదగా

ఇస్లాం సంప్రదాయాలు, సంస్కృతి తెలిసిన యువతిని పెళ్లి చేసుకోవడం తన లక్ష్యమంటూ ఓ నైజీరియన్‌.. ఇంజినీర్‌ అస్లాంఖాన్‌ పేరుతో పాతబస్తీ యువతికి మాయమాటలు చెప్పాడు. పెళ్లి ఖర్చులకు 75వేల పౌండ్లు పంపుతున్నానంటూ నమ్మించాడు. వాటిని తీసుకునేందుకు కస్టమ్స్‌ సుంకం, ఇతర పన్నుల పేరుతో రూ.16లక్షలు దోచుకున్నాడు. సదరు యువతి మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది.

హైదరాబాద్‌: దిల్లీలో ఉంటున్న నైజీరియన్‌ జీవన్‌ సాథీ డాట్‌కామ్‌లో  రెండు నెలల క్రితం బాధితురాలు నమోదు చేసిన వివరాలను పరిశీలించాడు. ఆమెను మోసం చేసేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. తన తల్లిదండ్రులు ముస్లింలైనా.. భారతీయులేనని ఏళ్ల క్రితమే లండన్‌లో స్థిరపడ్డారని ఆమెకు చెప్పాడు. ఇంజినీర్‌గా లండన్‌లోనే పని చేస్తున్నానని చెప్పాడు. నైజీరియన్‌ చెప్పిన మాటలను విశ్వసించిన యువతి అతడితో వాట్సప్‌ ద్వారా మాట్లాడేది. గతనెల 12న 2019న నైజీరియన్‌ ఫోన్‌ చేసి పెళ్లి ఖర్చులకు 75వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.54లక్షలు) పంపుతున్నానని, బహుమతి పెట్టె శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాక అధికారులు ఫోన్‌ చేస్తారని చెప్పాడు. మూడు రోజుల తర్వాత నైజీరియనే.. శంషాబాద్‌ విమానాశ్రయం అధికారిగా ఫోన్‌ చేసి బహుమతి పెట్టెను పంపించాలంటే రూ.1.5లక్షలు చెల్లించాలని చెప్పాడు. ఇలా వారం రోజుల్లో రూ.16 లక్షలు తన  ఖాతాల్లోకి వేయించుకున్నాడు. అనంతరం ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేశాడు. మోసం జరిగిందని గ్రహించిన యువతి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  తెలిపింది.

హైదరాబాద్‌లో ఉందామంటూ..: తనపేరు అస్లాం ఖాన్‌ అంటూ సంతోష్‌నగర్‌లో ఉంటున్న యువతిని పరిచయం చేసుకున్న నైజీరియన్‌.. లండన్‌లోని ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నానని చెప్పాడు. రెండున్నర నెలల క్రితం మొదలైన వీరి సంభాషణలు ఫిబ్రవరి వరకూ కొనసాగాయి. లండన్‌లో లక్షల పౌండ్లు సంపాదించానని, ఇటీవలే తన అమ్మ భారత్‌లో తన మూలాలున్నాయని చెప్పగా.. దేశంపై ఆసక్తి కలిగిందని వివరించారు. ‘నిన్ను పెళ్లి చేసుకున్నాక హైదరాబాద్‌లో స్థిరపడదామ’ని చెప్పాడు. పెళ్లి ఖర్చులకు తొలుత వేల పౌండ్లు పంపుతానని, పెళ్లయ్యాక 2లక్షల పౌండ్లతో ఇల్లు కొందామని ఆమెను మరింత నమ్మించాడు. రెండు నెలలు విధులు నిర్వహిస్తే భారత్‌కు వచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని చెప్పాడు.

ఇల్లు అమ్మిన డబ్బు నుంచి..: బాధితురాలు తనను నమ్మిందన్న విషయం తెలుసుకున్న నైజీరియన్‌ పదిహేను రోజుల వ్యవధిలో ఆమె వద్ద నుంచి రూ.16లక్షల నగదు దోచుకున్నాడు. శంషాబాద్‌ విమానాశ్రయం అధికారిగా మాట్లాడిన నైజీరియన్‌.. తమ నిబంధనల ప్రకారం 10వేల పౌండ్లు మాత్రమే ఉచితంగా ఇస్తామంటూ చెప్పాడు. మిగిలిన 65వేల పౌండ్లకు రూ.1.5లక్షలు చెల్లించాలని చెప్పగా బాధితురాలు 1.5 లక్షలు అతడు చెప్పిన ఖాతాలో వేసింది. ఆదాయపు పన్ను రూ.1.70లక్షలు కట్టాలని చెప్పగా ఆమె ఆ మొత్తాన్ని కూడా పంపించింది. గిఫ్ట్‌ ట్యాక్స్‌ కింద రూ.8.30లక్షలు పంపించాలని కోరగా.. తన వద్ద డబ్బు లేకపోవడంతో తండ్రికి విషయాన్ని వివరించింది. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఆమె తండ్రి ఉన్న ఇల్లు అమ్మి రూ.70లక్షలను బ్యాంకులో ఉంచాడు. బాధితురాలి కోరిక మేరకు అందులోంచి రూ.10లక్షలను ఇచ్చాడు. ఇక నైజీరియన్‌ ఫోన్‌ చేసి.. చివరగా రూ.4.5లక్షలు ఇస్తేనే బహుమతి పెట్టెను పంపిస్తామంటూ చెప్పాడు. దీంతో ఆమె రూ.4.5లక్షలు అతడు సూచించిన ఖాతాలో వేసింది. నగదు ముట్టిందా? లేదా? అని నిర్దరించుకునేందుకు ఫోన్‌ చేయగా… నైజీరియన్‌ స్పందించలేదు. వరసగా రెండురోజులు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని బాధితురాలు గ్రహించింది.