జాతీయం

‘నా భార్య అబద్ధం చెప్పదు’

అమృత్‌సర్‌: తనకు టికెట్‌ ఇవ్వకుండా పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ అడ్డుపడ్డారని ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్‌ కౌర్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సిద్ధూ స్పందించారు. తన భార్యకు మద్దతుగా ఆయన మాట్లాడారు.

‘నాభార్య ఎప్పుడూ అబద్ధం చెప్పదు. ఆమెకు ధైర్యం ఎక్కువ. ఆమెకు నైతిక విలువలు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్న సందర్భంగా..‘ముఖ్యమంత్రిపై మీభార్య చేసిన ఆరోపణలపై మీరేమంటారు?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. కొన్నాళ్లుగా పంజాబ్‌ కాంగ్రెస్‌ నేతల్లో విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, సిద్ధూల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీంతో రాహుల్‌ గాంధీ నిర్వహించిన కొన్ని ఎన్నికల ప్రచార సభలకు కూడా సిద్ధూ గైర్హాజరయ్యారు.

పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌ నుంచి సిద్ధూ భార్య పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పవన్‌ కుమార్‌ భన్సాల్‌కు ఆ స్థానాన్ని కేటాయించారు. తర్వాత ఆమె అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం నుంచి టికెట్‌ ఆశించినా అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. సిట్టింగ్‌ ఎంపీ, సీనియర్‌ నేత గుర్జీత్‌ సింగ్‌ను అక్కడ నుంచి కాంగ్రెస్‌ బరిలోకి దింపింది.