ఆంధ్రప్రదేశ్

నా తర్వాతే నరేంద్రమోదీ

విజయవాడ: ‘నా తర్వాతే ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాల్లోకి వచ్చారు.. నరేంద్ర మోదీ కంటే నేనే సీనియర్‌ని.. నేను 1995లో సీఎం అయితే, ఏడేళ్ల తర్వాత 2002లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని’ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అయితే అవకాశం రావడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారని గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కృష్ణా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జ్ఞానబేరి’ సభలో అన్నారు.

ఈ సభలో ఆయన మాట్లాడుతూ విభజన తరువాత రాష్ట్రానికి న్యాయం చేస్తారనుకుంటే నమ్మకద్రోహం చేశారని ధ్వజమెత్తారు. వేంకటేశ్వరస్వామి సాక్షిగా అన్ని చేస్తామని నమ్మకంగా చెప్పి, నాలుగు ఏళ్లు ఏమీ పట్టించుకోకుండా నట్టేట ముంచారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయూత ఇస్తే గుజారాత్‌ను దాటిపోతుందని నరేంద్రమోదీ భావించారన్నారు. మనస్సులో ఏదో పెట్టుకుని మనకు న్యాయం చేయలేదని, అయినా మన రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని అన్నారు.

నరెంద్రమోది వచ్చిన తరువాత దేశం అభివృద్ధి ఆగిపోయిందని అభిప్రాయపడ్డారు. రూపాయి విలువ పడిపోయింది. పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరిగిపోయాయని, నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారన్నారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశానికి పనులు చేయడం లేదని సీఎం దుయ్యబట్టారు. దక్షిణ భారత దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఎక్కువ పన్నులు వెళుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దమౌతోందన్నారు.