అంతర్జాతీయంక్రీడలు

నా కూతుళ్లను బయటికి పంపను : అఫ్రిది

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ మాజీ క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ షాహిదీ అఫ్రిది ఎన్నిసార్లు చివాట్లు తిన్నా.. తన పద్ధతి మార్చుకోవట్లేదు. తరచూ ఏదో ఒక వివాదం సృష్టించుకొని మరీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే, కశ్మీర్‌ విషయంలో ఒకసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత గేమ్‌ ఛేంజర్‌ పేరుతో తాను రాసుకుంటున్న ఆత్మకథలో తన అసలు వయసు బయటపెట్టాడు. అంతటితో ఆగకుండా ఇతర క్రికెటర్లను విమర్శిస్తూ.. తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే, నిన్నటి వరకూ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకున్న అఫ్రిది ఈసారి తన పిల్లలు గురించి కూడా పుస్తకంలో రాసుకొచ్చాడు.

అఫ్రిదికి అన్షా, అజ్వా, అస్మారా, అక్సా నలుగురు పిల్లలున్నారు. అయితే వాళ్ల గురించి తన పుస్తకంలో ప్రస్తావించిన అఫ్రిది.. ‘నా కూతుళ్లను బయట ఆటలాడేందుకు పంపించను. ఇండోర్‌ గేమ్స్‌ అయితే ఫరవాలేదు. కానీ, ఔట్‌డోర్‌ గేమ్స్‌ ఆడేందుకు వెళతానంటే మాత్రం వాళ్లను నేను అనుమతించను. అజ్వా, అస్మారా ఇద్దరూ.. నిండుగా వస్త్రాలు ధరించి ఇండోర్‌లో ఏ ఆటైనా ఆడుకునేందుకు నా వద్ద అనుమతి తీసుకున్నారు. నా పిల్లలను క్రికెట్‌ వైపు పంపించే ప్రసక్తే లేదు. ఇండోర్‌లో అన్ని ఆటలు ఆడుకునేందుకు నా కూతుళ్లకు స్వేచ్ఛనిచ్చాను. కానీ, ఇతరులతో పబ్లిక్‌లో పోటీ పడేందుకు కూడా నేను ఒప్పుకోను. స్త్రీవాదులు నాగురించి ఏమైనా అనుకోవచ్చు. నేనవన్నీ పట్టించుకోను’ అని అఫ్రిది తెలిపాడు.