అంతర్జాతీయం

నాన్నను అడిగి పారితోషికం తీసుకున్నా

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, తన తండ్రి ‘విశ్వనటుడు’ కమల్‌హాసన్‌ల కాంబినేషన్‌లో ఓ సినిమాకు దర్శకత్వం వహించాలన్నదే తన కోరిక అని కమల్‌ రెండో గారాలపట్టి అక్షరహాసన్‌ పేర్కొంది. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానరుపై కమల్‌ నిర్మాతగా రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో విక్రం హీరోగా నటించిన చిత్రం ‘కడారం కొండాన్‌’. నాజర్‌ కుమారుడు అభిహాసన్‌, అక్షరహాసన్‌ ఇందులో నటించారు. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలు, తన కెరీర్‌ గురించి అక్షర మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే

‘‘ నేను అమితాబ్‌బచ్చన్‌తో కలసి ‘షమితాబ్‌’ చిత్రంలో నటించా. ఆ సినిమాకు నటిగా హిందీలో మంచి గుర్తింపు లభించింది. తమిళంలో అజిత్‌తో కలిసి ‘వివేగం’ చేశా. ఈ సినిమాలను చూసే దర్శకుడు రాజేష్‌ ఈ కథను వినిపించారు. ఈ సినిమాలో నాది గర్భిణి పాత్ర. కథ వినేటప్పుడే ఆసక్తికరంగా అనిపించింది. అందుకే నటించేందుకు అంగీకరించా. కథ ప్రకారం అభిహాసన్‌ భార్యగా ఇందులో కనిపిస్తా.

నాన్న శిక్షణ ఇచ్చారు..

సాధారణ పాత్రలతో పోల్చితే గర్భిణిగా నటించడం చాలా కష్టమైన విషయం. కడుపులో దుస్తులు పెట్టుకుని గర్భిణిలా ముందుగానే నటించి శిక్షణ తీసుకున్నా. నిజం చెప్పాలంటే ఈ సినిమా ఆరంభించడానికి ముందుగానే వర్క్‌షాప్‌లో తర్ఫీదు పొందాను. నాన్న కూడా శిక్షణ ఇచ్చారు. ఇంట్లో మాత్రమే నాన్న, నేను తండ్రీకుమార్తె. వర్క్‌షాప్‌లోగానీ, షూటింగ్‌ స్పాట్‌లోగానీ నాన్నను ‘సర్‌’ అనే పిలుస్తా. ఇక ఇంట్లో తమిళం, హిందీ, ఆంగ్లంలో మాట్లాడుకుంటాం. అమ్మతో ఆంగ్లంలోనే మాట్లాడుతా.

నాన్న నుంచి పారితోషికం

నేను పుట్టకముందే రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ సంస్థను ఆరంభించారు. అలాంటి గుర్తింపు పొందిన మా సొంత బ్యానరులో నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన న్యాయమైన రెమ్యూనరేషన్‌ను నాన్న నుంచి తీసుకున్నా.

కమల్‌కు తమ్ముడిని!

నటనపరంగా నాన్న నుంచి ఎప్పటికప్పుడు సూచనలు తప్పకుండా తీసుకుంటా. ఆయన ఎప్పుడూ చెప్పే మాట ఒక్కటే… ‘నువ్వు పదో సినిమా అయినా, 20వ చిత్రమైనా అదే నీ మొదటిది అనుకుని శ్రమించు’ అని. నాకు, అక్కకు అప్పుడప్పుడు సరదాగా గొడవలొస్తుంటాయి. వెంటనే నాన్న జోక్యం చేసుకని మా సమస్యను పరిష్కరిస్తారు. నిజం చెప్పాలంటే నేను నాన్నకు తమ్ముడి తరహాలో ఉంటా. సినిమాల్లో రాణించాలంటే కమల్‌-సారికల కుమార్తె అనే అర్హత మాత్రమే సరిపోదు.

ప్రేమ పెళ్లి..?

నటుడిగా, రాజకీయ నేతగా నాన్నను చూస్తుండటం చాలా ఆనందంగా ఉంది. నేను ముంబయిలో ఉన్నందువల్ల ఓటు వేసేందుకు చెన్నైకి రాలేకపోయా. ‘మక్కల్‌ నీది మయ్యం’ గురించిన వార్తలు ఎప్పటికప్పుడు చదువుతుంటా. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. దేశంలో మారాల్సిన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మా కుటుంబంలో ప్రేమకు ఎలాంటి అడ్డులేదు. పలు ప్రేమ వివాహాలు మా కుటుంబంలో జరిగాయి. అందువల్ల సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా.

ఆ సినిమాకు దర్శకురాలిగా…

చిత్ర పరిశ్రమలో సహాయ దర్శకురాలిగానే నా కెరీర్‌ను ఆరంభించా. ‘శెభాష్‌నాయుడు’ చిత్రంలో కూడా అలా పనిచేశా. దర్శకురాలిగా రాణించడమే నా కల. కానీ ఇప్పుడు నటనపై దృష్టిపెట్టా. రజనీకాంత్‌, నాన్న హీరోలుగా నటించే ఓ సినిమాకు దర్శకత్వం చేయాలని ఆశ పడుతున్నా. అందుకు తగ్గ కథను సిద్ధం చేసుకోవడం గురించి ఆలోచిస్తున్నా. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే మళ్లీ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమాను తప్పకుండా తెరకెక్కిస్తా. అలాగే కార్తి, విక్రం కలయికలో కూడా ఓ సినిమా చేయాలనుంది.’’