జాతీయంవైద్యం

నాన్నకు అమ్మయ్యింది…!

కోల్‌కతా: ప్రాణాపాయంలో ఉన్న తండ్రిని కాపాడుకునేందుకు తన ప్రాణాన్ని సైతం లెక్కచేయలేదు ఓ కుమార్తె. తన కాలేయంలో సగభాగాన్ని తండ్రికి పంచి ఆయనకు పునర్జన్మనిచ్చింది. ఆడపిల్లలు ఎందుకూ పనికిరారు అని అనుకునే ఎందరో మగమహానుభావులకు ఈమె త్యాగం.. ఓ గుణపాఠం.

కోల్‌కతాకు చెందిన 19ఏళ్ల రాఖీ దత్తా తండ్రి తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. కాలేయ మార్పిడి చేస్తేగానీ ఆయన బతకరు అని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో తండ్రిని కాపాడుకునేందుకు రాఖీదత్తా తన కాలేయాన్ని పంచేందుకు ముందుకొచ్చింది. తన కాలేయంలో 65శాతాన్ని తండ్రికి దానం చేసి ఆయనను బతికించుకుంది.

రాఖీ దత్తా కథను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గొయెంకా ఇటీవల ట్వీట్ చేశారు. ‘నొప్పి, కత్తిగాట్లు, భవిష్యత్తులో ప్రమాదాల గురించి ఆలోచించకుండా రాఖీదత్తా తన కాలేయాన్ని తండ్రికి పంచి ఇచ్చింది. తండ్రి పట్ల కూతురు చూపించే ప్రేమ చాలా ప్రత్యేకం. కూతుళ్లు ఎందుకూ పనికిరారు అని అనుకునేవారికి ఈమె సరైన సమాధానం’ అని గొయెంకా ట్వీటర్‌లో పేర్కొన్నారు. అంతేగాక.. తండ్రీకూతుళ్ల ఫొటోను కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. తండ్రి కోసం రాఖీ చేసిన త్యాగాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.