జాతీయం

నన్ను ఇందిరాజీతో పోల్చవద్దు: ప్రియాంక

కాన్పూర్‌: తనని మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చవద్దని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దేశానికి సేవ చేయడంలో మాత్రం ఆమె అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేస్తామన్నారు. ‘‘ నేను ఇందిరాగాంధీతో సరితూగను. కానీ దేశసేవ పట్ల ఆమె గుండెల్లో ఉన్న అంకితభావమే నాతో పాటు నా సోదరుడి(రాహుల్ గాంధీ) హృదయంలోనూ ఉంది. మా నుంచి దాన్ని ఎవరూ దూరం చేయలేరు. మీకు సేవ చేస్తూనే ఉంటాం’’ అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ భాజపా ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకే భాజపా అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. కేవలం ప్రచార ఆర్భాటాలకే భాజపా నాయకులు పరిమితమవుతున్నారని విమర్శించారు. కాన్పూర్‌ను స్మార్ట్‌ సిటీగా మారుస్తామని హామీ ఇచ్చిన భాజపా.. నగరంలో ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించలేదన్నారు. ‘వన్ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌’ సైనికుల హక్కు అని.. దాన్ని కూడా భాజపా ప్రభుత్వం తమ ఘనతగా చెప్పుకోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్‌ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని భాజపా వలే ధనవంతులకు సేవ చేసే పార్టీ కాదన్నారు. కాంగ్రెస్‌ న్యాయ్‌ పథకానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్న భాజపాకు.. బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టడానికి మాత్రం డబ్బులు ఉన్నాయన్నారు. అలాగే జీఎస్టీ, నోట్ల రద్దు లాంటి చర్యలను కూడా ఆమె తప్పుబట్టారు. మోదీని ఒక అసమర్థ ప్రధానిగా అభివర్ణించారు. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్న యూపీలో ఇప్పటికే రెండు దశలు పూర్తయిన విషయం తెలిసిందే.