తెలంగాణ

నగేశ్‌ ముదిరాజ్‌పై కాంగ్రెస్‌ వేటు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత నగేశ్‌ ముదిరాజ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. గాంధీభవన్‌లో కోదండరెడ్డి అధ్యక్షతన భేటీ అయిన క్రమశిక్షణా సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఇందిరాపార్కు వద్ద జరిగిన ఘర్షణ నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌ ముదిరాజ్‌కు సంబంధించిన వ్యవహారంపై చర్చించారు. ఈ సందర్భంగా నగేశ్‌ ముదిరాజ్‌ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరై జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. వీహెచ్‌ సైతం ఆ రోజు జరిగిన ఘటనపై లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. పార్టీ నేతలు అందించిన సమాచారాన్ని సైతం కమిటీ పరిశీలించింది. అన్ని అంశాలపై లోతుగా పరిశీలించాక నగేశ్‌ ముదిరాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, పార్టీ నుంచి తనను సస్పెండ్‌ చేయడాన్ని నిరసిస్తూ నగేశ్‌ గాంధీ భవన్‌ వద్ద నిరసనకు దిగారు.