జాతీయం

ధోనీ, కోహ్లీ సారథ్యంలో ఉన్న తేడా అదే!

ముంబయి: మాజీ సారథి ధోనీ, ప్రస్తుత సారథి విరాట్‌ కోహ్లీ రూటే సపరేటు అంటున్నారు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్. సారథిగా ధోనీ కోణం వేరు, కోహ్లీ కోణం వేరని చెప్పాడు. ప్రపంచకప్‌ సమరం మరో కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. సారథిగా కోహ్లీకిదే తొలి ప్రపంచకప్‌. ధోనీకి ఈ విషయంలో ఎంతో అనుభవం ఉంది. దీంతో కోహ్లీ ఈ మెగా టోర్నీలో సారథి ఎలా రాణిస్తాడోనని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాలన్నింటిపై రోడ్స్‌ మాట్లాడాడు.
‘నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ జట్టును ముందుకు నడిపే వాళ్లకు పర్‌ఫెక్ట్‌ ఉదాహరణ మహేంద్ర సింగ్‌ ధోనీ. ఫిట్‌నెస్‌, మైండ్‌సెట్‌లో తనకు తానే సాటి. కోహ్లీ, ధోనీల సారథ్యంలో ఎన్నో వైవిధ్యాలున్నాయి. కోహ్లీ ప్రతి మ్యాచ్‌లోనూ తన మార్క్‌ చూపిస్తాడు. ధోనీ ఇటు సారథిగానూ, అటు ఆటగాడిగానూ మ్యాచ్‌ను మలుపు తిప్పుతాడు. మెగా టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌ జట్టుగా మారడానికి  మార్గదర్శనమే కారణం. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ ఎంతో వినోదాత్మకంగా సాగింది’ అని పేర్కొన్నాడు.
తాజాగా కోహ్లీ కూడా ధోనీ సారథ్యంపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీలోనే తానెంతో నేర్చుకున్నానని, జట్టుకు ధోనీ సలహాలు సూచనలు అవసరమని పేర్కొన్నాడు.