తెలంగాణ

ధోనీతో సహా ఆటగాళ్ల మార్పు?

హైదరాబాద్‌: ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఘనంగా ముగిసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ (డాడ్స్‌ ఆర్మీ) చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఒక్క పరుగుతో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకొంది. హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ పోరాడి చెన్నై ఓడిపోయింది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వచ్చే ఏడాది జట్టు కూర్పులో మార్పులు చెయ్యాల్సిన అవసరముందన్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆటగాళ్లు కుదురుకునేందుకు కాస్త సమయం కేటాయిస్తాం. ఒక టైటిల్‌ గెలిచి మరోసారి ఫైనల్‌కి చేరడమంటే రెండేళ్లు బాగా ఆడినట్టే. మా జట్టులో వయసుపైబడిన ఆటగాళ్లు ఉన్నారని తెలుసు. ఏదో ఒక సమయంలో జట్టులో మార్పు అవసరం. ధోనీతో సహా జట్టు కూర్పు చెయ్యాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నాడు.

‘అన్ని క్రికెట్‌ ఫార్మాట్ల నుంచి రిటైరైన షేట్‌వాట్సన్‌ లాంటి ఆటగాడు వచ్చే ఏడాది ఐపీఎల్‌ ఆడే అవకాశం లేదు. దీన్ని బట్టి ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ నుంచే జట్టులో మార్పులు అవసరం. వాట్సన్‌ ఈ సీజన్‌ లీగ్‌ దశలో చెప్పుకోదగ్గ పరుగులు చెయ్యలేకపోయాడు. ప్లేఆఫ్స్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చినా జట్టుని విజయపథంలో నడిపించిలేకపోయాడు. ధోనీ ప్రపంచకప్‌ నుంచి తిరిగొచ్చాక వచ్చే ఏడాది ఆటగాళ్ల కూర్పుపై ఆలోచిస్తాం. ఇతర జట్లు యువక్రికెటర్లను ప్రోత్సహించినట్టు మా జట్టు కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత ఉంది’ అని వివరించాడు.

ఇంకా మాట్లాడుతూ.. ఈసారి చెన్నై పిచ్‌ చాలా కష్టతరమైందని, అక్కడ ఆడటం అంత సులువుగా అనిపించలేదని చెప్పాడు. చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఈ సీజన్‌లో రాణించలేకపోయారని, అదే ప్రధాన కారణమని స్పష్టంచేశాడు. ఏదేమైన ఆఖరి బంతి వరకూ పోరాడి గెలిచేందుకు మాత్రం రాజీపడలేదని తమ ఆటగాళ్లని మెచ్చుకున్నాడు. వాట్సన్‌ ఆఖరి ఓవర్‌ వరకూ క్రీజులో ఉండి 80 పరుగులు చేయగా మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం అందలేదన్నాడు. అనుకోకుండా అతడు రనౌటవ్వడం వల్ల ముంబయి గెలిచిందని, అలాగే ధోనీ(2) తక్కువ పరుగులకే ఔట్‌కావడం కూడా ప్రత్యర్థికి కలిసొచ్చిందని అన్నాడు. ఆఖరి బంతికి చెన్నై ఓడిపోవడం ధోనీ ఊహించలేకపోయాడని తెలిపాడు.

‘చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు అవసరమైనప్పుడు కచ్చితంగా గెలుస్తామనుకున్నాం. వాట్సన్‌ ఒక సిక్స్‌ కొట్టింటే పరిస్థితులు వేరుగా ఉండేవి. కానీ మలింగ అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఆఖరి బంతికి శార్దుల్‌ను ఎల్బీగా చేసి ఔట్‌చేశాడు. తన అనుభవం ఏంటో మరోసారి రుజువు చేయడంతో పాటు ముంబయికి నాలుగో విజయాన్ని అందించాడు’ అని ఫ్లెమింగ్‌ వివరించాడు.