క్రీడలు

ధోని ఖాతాలో మరో రెండు రికార్డులు

బెంగళూరు : ధోనీ టాప్‌ గేర్‌లో దూసుకెళుతున్నాడు. మెరుపులాంటి కీపింగ్‌తో పాటు పదునైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థికి కొరకరాని కొయ్యలా మారాడు. ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న చెన్నై కెప్టెన్‌ తాజాగా మరో మైలురాయి చేరుకున్నాడు. ఐపీఎల్‌లో 200 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించడంతో పాటు కెప్టెన్‌గా 4,000 పరుగులు పూర్తి చేశాడు. ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ధోనీ కంటే ముందు క్రిస్‌గేల్‌(323), ఏబీ డివిలియర్స్‌(204) ఉన్నారు. ధోని 203 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత రోహిత్‌ శర్మ(190), సురేశ్‌రైనా(190), విరాట్‌ కోహ్లీ(186) ఉన్నారు. 2019 సీజన్‌లో ధోని అద్భుతంగా రాణిస్తున్నాడు. బెంగళూరుపై 84 పరుగులు చేసి ఇదే సీజన్‌లో కోల్‌కతా మీద చేసిన 75 పరుగుల అత్యధిక స్కోరును బద్దలు కొట్టాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 314 పరుగులు చేశాడు. అందులో 17 సిక్సర్లు ఉన్నాయి