తెలంగాణ

దొంగల ఇళ్లకు తాళాలు

హైదరాబాద్‌: వనస్థలిపురం పనామా కూడలి సమీపంలోని యాక్సిక్‌ బ్యాంకు ఏటీఎం వద్ద నుంచి రూ.58.97లక్షల్ని అపహరించిన రాంజీనగర్‌ ముఠాను పట్టుకునేందుకు రాచకొండ పోలీసులు ప్రయత్నాలనుముమ్మరం చేశారు. ఘటనాస్థలి వద్ద లభించిన సీసీ ఫుటేజీల ఆధారంగా నలుగురు దొంగల్ని పేర్లతో సహా పోలీసులు గుర్తించారు. మొత్తం ఏడుగురు దొంగలు ఈ నేరంలో పాల్గొన్నారనే ఆధారాల్ని సేకరించారు. వారి కోసం తమిళనాడు రాష్ట్రం రాంజీనగర్‌ జిల్లాలోని స్వస్థలాలకు వెళ్లారు. కానీ దొంగల ఇళ్లకు తాళాలు కనిపించినట్లు సమాచారం. చోరీకి పాల్పడిన అనంతరం తమ వివరాల్ని పోలీసులు గుర్తించారనే సమాచారంతో దొంగలు వేరే ప్రాంతాలకు పారిపోయినట్లు  అనుమానిస్తున్నారు.  సాధారణంగానే ఈ ముఠా చోరీలకు పాల్పడిన అనంతరం కొన్ని రోజుల వరకు పోలీసుల నిఘాకు చిక్కకుండా దూర ప్రాంతాల్లోనే మకాం వేస్తుంటుంది. అంతా సద్దుమణిగిందని నమ్మకం కలిగిన తర్వాతే స్వస్థలాలకు చేరుకుంటారు.
నగదు పెట్టెను అపహరించిన తర్వాత వనస్థలిపురం పనామా కూడలి నుంచి ఆటోలో దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చిన దుండగులు.. మరో ఆటోలో మలక్‌పేట వరకు వెళ్లారు. అక్కడి సులభ్‌ కాంప్లెక్స్‌లో పెట్టెను పడేసి బ్యాగుల్లో డబ్బు సర్దుకొని పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీనికితోడు రాంజీనగర్‌ ముఠాగా నిర్ధారణ కావడంతో మలక్‌పేట, సికింద్రాబాద్‌, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటు ఎంజీబీఎస్‌ బస్‌స్టాండ్‌లోని సీసీ ఫుటేజీల్ని పరిశీలించారు. ఎక్కడా వారి ఆచూకీ లభ్యం కాలేదు. దీన్ని బట్టి సొంత వాహనం ఏదైనా సమకూర్చుకుని ఉంటారా..? అనే కోణంలో ఆరా తీశారు. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన అనంతరం ప్రైవేటు బస్సుల్లోనే నగరం దాటి ఉంటారని భావిస్తున్నారు. ఈక్రమంలో స్వస్థలాల్లోనూ వారి జాడ లేకపోవడంతో వారి కార్యకలాపాల గురించి తెలిసిన తమిళనాడు పోలీసుల సహకారంతో గాలింపు ముమ్మరం చేసినట్లు సమాచారం.