జాతీయం

దొంగతనానికి వెళ్లి పోలీసుల సాయం కోరాడు

ఓస్లో: ఒక్కోసారి చోటుచేసుకొనే విచిత్రకరమైన సంఘటనలు భలే నవ్వు తెప్పిస్తాయి. ఆ పరిస్థితే నార్వేలో ఓ 17 ఏళ్ల దొంగకు ఎదురైంది. దొంగతనానికి వెళ్లి, కారులో చిక్కుకుపోయి, చివరకు సాయం కోసం పోలీసులకే ఫోన్ చేయాల్సిన స్థితి తలెత్తింది. పోలీసులు ట్వీట్ చేయడం ద్వారా ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో చూద్దామా!

కారులో ఉన్న వస్తువులు దొంగతనం చేయడానికి వెళ్లగా అందులో చిక్కుకుపోవడంతో, సాయం కోసం సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఓ టీనేజ్‌ యువకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. ‘ఆ కారులో కూర్చొనే మాకు ఫోన్‌ చేశాడు. కారు లాక్‌ పడటంతో అతడు దాంట్లోంచి బయటపడలేకపోయాడు. ఒక స్నేహితుడికి కాల్ చేసినట్లు చేశాడు. మాకు ఫోన్‌ చేసినప్పుడు అతడు చాలా ఒత్తిడితో ఉన్నాడు. అతడిని కారులో నుంచి బయటకు తీసుకురాగానే ఆ భయం మొత్తం మటుమాయమైంది’ అని ఆ ట్వీట్‌లో వెల్లడించారు నార్వే పోలీసులు. ఆ తరవాత పోలీసులు అతడిని స్టేషన్‌ తీసుకెళ్లి విచారించి, తల్లిదండ్రులకు అప్పగించారు.