జాతీయం

దేశ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం: జై శంకర్

ఇతర దేశాలతో  దౌత్యసంబంధాల అంశాల్లో దేశ ప్రయోజనాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని భారతదేశం స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో దిల్లీలో బుధవారం జరిగిన ద్వైపాక్షిక  సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా పాంపియో మీడియాతో మాట్లాడుతూ..యూఎస్‌కు భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్లాయని అన్నారు. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థల కొనుగోలుపై అమెరికా ఆంక్షలు ప్రభావం గురించి మీడియా ప్రశ్నకు జైశంకర్ సమాధానమిస్తూ..‘మాకు అనేక దేశాలతో చారిత్రక సంబంధాలున్నాయి. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు దేశ ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యం ఇస్తాం’ అని కరాఖండీగా తేల్చిచెప్పారు. పాంపియోతో జరిగిన సమావేశంలో ఎనర్జీ, వాణిజ్యం, అఫ్గనిస్థాన్‌, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు గురించి చర్చించామని తెలిపారు. ఉగ్రవాదం కట్టడిపై ట్రంప్‌ యంత్రాంగం నుంచి లభిస్తోన్న మద్దతుపై సంతోషం వ్యక్తం చేశారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం పాంపియో ఈ రోజు ఉదయం భారత్‌కు చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉన్నత స్థాయికి చేర్చడానికి మోదీ, ట్రంప్‌ నాయకత్వాలు నిబద్ధతతో ఉన్నాయని వెల్లడిస్తూ పాంపియో భారత్‌కు చేరుకున్న సందర్భంగా ఆమెరికా ఓ ప్రకటన విడుదల చేసింది.  ఈ పర్యటనలో భాగంగా ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి తెలిసిందే.