జాతీయం

దేశాభివృద్ధికి ‘నారీ భేరీ’ ఇక తప్పనిసరి

తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌ చరిత్ర సృష్టించారు. స్వత్రంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ‘నారీ తు నారాయణి’ భారతదేశ సంస్కృతి అని పార్లమెంటు సాక్షిగా మరోసారి గుర్తుచేశారు. మహిళల సాధికారిత గురించి వర్ణించేటప్పుడు ఆమె నోటి నుంచి ఆణిముత్యాల్లాంటి పదాలు జాలువారాయి. దేశం మరింత ఎత్తుకు ఎదగాలంటే స్త్రీల అభివృద్ధి తప్పనిసరని నిర్మల స్పష్టం చేశారు. ప్రతి పనిలో వారి భాగస్వామ్యం కచ్చితంగా ఉండాల్సిందేనని వెల్లడించారు. స్వామి వివేకానందుడు ప్రవచించిన ‘మహిళల పరిస్థితి మెరుగవ్వకుండా ప్రపంచం క్షేమంగా ఉండదు. ఒంటి రెక్కతో పక్షి ఆకాశంలో విహరించడం అసాధ్యం’ అనే వాఖ్యం ఇందుకు నిదర్శనమని ఆమె తెలిపారు.

బడ్జెట్‌లో మహిళలకు కేటాయింపుల గురించి నిర్మల మాట్లాడుతూ వారి పట్ల ప్రభుత్వ వైఖరి మారిందని వెల్లడించారు. మహిళా కేంద్రంగా కాకుండా మహిళా నాయకత్వంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా మహిళల ఎంటర్‌ప్రిన్యూర్‌ షిప్‌ను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇక నుంచి దేశంలోని ప్రతి జిల్లాకు మహిళా స్వయం సహాయక బృందాలను (ఎస్‌హెచ్‌జీ) విస్తరిస్తున్నామని ప్రకటించారు.

మహిళా సాధికారితను పెంచేందుకు, వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు స్వయం సహాయ బృందంలోని ఒక మహిళకు మోదీ ప్రభుత్వంలోని ముద్రా పథకం కింద రూ.లక్ష రుణం పొందేందుకు అర్హత కల్పించారు. ఎస్‌హెచ్‌జీలోని ప్రతి మహిళకు జన్‌ధన్‌ ఖాతాలో పాటు రూ.5,000 ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌలభ్యం కల్పిస్తున్నామని తెలిపారు.  అన్ని రంగాల్లోనూ స్త్రీల భాగస్వామ్యం పెరిగిందని తెలిపారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో మహిళల ఓటింగ్‌ శాతం పురుషులతో సమానంగా ఉంది. ఈ రోజున పార్లమెంటులోని ఈ సభలో 78 మంది మహిళలు ఉన్నారు’ అని ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు. మహిళల భాగస్వామ్యం లేకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి నోచుకోదని స్పష్టం చేశారు. సమ్మిళిత శిశు అభివృద్ధి పథకం కింద 2019-20 ఆర్థిక ఏడాదికి రూ.27,584 కోట్లు కేటాయించారు. మహిళల సంక్షేమం కోసం చేసే వనరుల కేటాయింపులను సమర్థంగా వినియోగించుకొనేందుకు ‘నారీ తు నారాయణి’ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు.