క్రైమ్

దేవుడి సన్నిధిలో కీచక పర్వం..!

గుంటూరు: దేవుడి సన్నిధిలో సేవ చేసుకోవాలని వెళితే అక్కడ లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధిత మహిళ ఆవేదన చెందింది. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తే తనపై కక్ష కట్టి తనను, తన కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడని కన్నీళ్లపర్యంతమైంది. స్పందించిన ఎస్పీ వెంటనే బాధిత మహిళ సమస్య పరిష్కరించి ఆమెకు రక్షణ కల్పించాలని ఆదేశించారు.
 బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఓ మహిళ సమీపంలోని ఓ ఆలయానికి సేవచేయడానికి వెళుతుండేది. అక్కడ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. భగవంతుని సేవ కోసం అతని చేష్టలను కొంతకాలం భరించింది. కొద్దికాలానికి సదరు మహిళ భర్త మృతి చెందాడు. ఊహించని విధంగా తనకు జరిగిన దానికి ఆమె ఒంటిరిదై పోయింది. ఆ బాధ నుంచి బయట పడటానికి ఆలయానికి వెళితే మనసుకు కొంత ఊరట లభిస్తుందని భావించింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సదరు మహిళపై ఆలయ పర్యవేక్షకుడి ఆగడాలు శృతిమించాయి. భర్త చనిపోయాడని తెలుసుకున్నప్పటి నుంచి లైంగిక వేధింపులు మరింత పెంచాడు. అంతటితో ఆగకుండా ఆమెను ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్య సందేశాలు పెట్టాడు. ఇక అతని వేధింపులు భరించలేక అర్బన్‌ ఎస్పీ మహిళల రక్షణకు ప్రత్యేకంగా ప్రారంభించిన జ్వాల యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఎస్పీ సదరు బాధితురాలి సమస్య పరిష్కరించాలని డీఎస్పీ సౌమ్యలతను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ, పెదకాకాని పోలీసులు కలిసి సదరు కీచకుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. అదే సమయంలో ఆలయ నిర్వాహకులు సదరు వ్యక్తిని పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన అతగాడు మళ్లీ ఆమెపై కక్ష పెంచుకొని వేధింపులకు గురిచేయడం ఆరంభించాడు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని లేకపోతే నన్ను నా కుమార్తెను చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని కోరింది. ఆమె సమస్య పరిష్కరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.