జాతీయం

‘దివాలా’ ఎఫెక్ట్‌: 50శాతం కుంగిన జెట్‌ షేర్లు

రుణ సంక్షోభంతో మూతబడిన జెట్‌ ఎయిర్‌వేస్‌ను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)కి పంపాలని బ్యాంకర్ల బృందం నిర్ణయించడం జెట్‌ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. తాజా పరిణామాలతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో జెట్‌ షేర్లు కుప్పకూలాయి. ఒక్కో షేరు ధర 50శాతానికి పైగా పడిపోయింది. దీంతో కంపెనీ తన మార్కెట్‌ విలువలో సగం కంటే ఎక్కువే కోల్పోవాల్సి వచ్చింది.

స్టాక్ ఎక్స్ఛేంజీల్లో వరుసగా 12వ రోజు జెట్‌ షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ ఆరంభంలోనే 15 శాతానికి పైగా నష్టపోయిన షేరు ధర అంతకంతకూ దిగజారుతూ వచ్చింది. ఇంట్రాడేలో 52.78శాతం నష్టంతో రూ. 32.25 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో జెట్‌ షేరు ధర 39.62 శాతం నష్టంతో రూ. 41.30గా కొనసాగుతోంది. బీఎస్‌ఈలోనూ 39.39శాతం నష్టంతో రూ. 41.40గా ట్రేడ్‌ అవుతోంది. షేరు ధర కుప్పకూలడంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో రూ. 409.52కోట్ల జెట్‌ మదుపర్లు సంపద ఆవిరైంది. క్రితం సెషన్‌లో కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 775.87కోట్లుగా ఉండగా.. ఇంట్రాడేలో ఆ విలువ రూ.366.35కోట్లకు తగ్గింది.

జెట్‌ కోసం ‘షరతులతో కూడిన ఒక్క బిడ్‌’ మాత్రమే వచ్చినందున, దివాలా స్మృతి కింద ఆ సంస్థను ఎన్‌సీఎల్‌టీకి పంపాలని నిర్ణయించినట్లు బ్యాంకర్ల బృందం వెల్లడించింది. సదరు బిడ్‌దారు సెబీ నుంచి కూడా మినహాయింపులు కోరుతున్నారని, అందువల్ల దివాలాస్మృతి కిందే జెట్‌ ఎయిర్‌వేస్‌ను మెరుగ్గా పరిష్కరించవచ్చని భావించినట్లు తెలిపింది. దివాలా స్మృతికి చేరకుండా జెట్‌ సమస్యను పరిష్కరించేందుకు బ్యాంకర్లు ఎంతో ప్రయత్నించినా, సఫలం కానందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ పేర్కొంది.