జాతీయం

దిల్లీ కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్నవిభేదాలు!

దిల్లీ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ బ్లాక్‌ కమిటీలను రద్దు చేస్తూ దిల్లీ పీసీసీ చీఫ్‌ షీలా దీక్షిత్‌ తీసుకొన్న నిర్ణయాన్ని సీనియర్‌ నేత పీసీ.చాకో తీవ్రంగా తప్పుబట్టారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అలాగే షీలా ఆదేశాలను నిలుపుదల చేయాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ రాసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవం చెందడంతో షీలా దీక్షిత్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని సమీక్షించి ఆమెకు ఓ నివేదికను అందించింది. అందులో బ్లాక్ కమిటీలను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. అందుకనుగుణంగా షీలా శుక్రవారం నిర్ణయం తీసుకొన్నారు.

అయితే షీలా నిర్ణయాన్ని పీసీ.చాకో తప్పుబట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల ప్రమేయం లేకుండా బ్లాక్‌ కమిటీలను రద్దు చేయడం పార్టీ నియమాలకు విరుద్ధమన్నారు. వారంతా పార్టీ ఎన్నికల్లో గెలిచి పదవులు చేపట్టారని, అలా అర్థాంతరంగా తొలగించడం సబబు కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది సరైన నిర్ణయం కాదన్నారు. తిరిగి కమిటీలను ఏర్పాటు చేయడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆమ్‌ ఆద్మీతో పొత్తు విషయంపై కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. మరి కొన్ని నెలల్లో దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాలు ఉండొద్దని ఇటీవల రాహుల్‌ సూచించినట్లు సమాచారం. దానికి నేతలు అంగీకరించడంతో పాటు కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ, వాటిని పట్టించుకోకుండా తిరిగి నేతలు బాహాబాహీ అనుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.