క్రీడలు

దిల్లీని కలవరపెడుతున్న తొందరపాటు

విశాఖపట్నం : ఈ సీజన్‌లో సంచలన జట్టేదైనా ఉందంటే అది దిల్లీ క్యాపిటల్స్‌ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఇప్పటికే హేమాహేమీలను మట్టికరిపించిన ఆ జట్టు క్వాలిఫయర్‌ వరకూ దూసుకొచ్చింది.  టైటిల్‌ను ముద్దాడేందుకు ఇంకా రెండడుగుల దూరంలో వేచి చూస్తోంది. ఫైనల్‌కు చేరుకోవాలంటే మూడు సార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ను దాటాల్సి ఉంది. ఈ రోజు విశాఖపట్నం వేదికగా చెన్నైతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌ చేరుకొని తన కలను నిజంచేసుకోవాలని చూస్తోంది. అయితే, నిలకడకు మారుపేరైన చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోటీ పడనున్న దిల్లీని నిలకడ లేమి సమస్య కలవరపెడుతోంది. ఇప్పటికే కీలక సమయాల్లో బాధ్యతారాహిత్యంగా వికెట్లు కోల్పోయి పలు మ్యాచుల్లో పరాజయాన్ని మూటగట్టుకుంది. అందుకు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లే ప్రత్యక్ష ఉదాహరణ.

దిల్లీకి యువ ఆటగాళ్లే బలం.. బలహీనత కూడా. దిల్లీ ఇక్కడి వరకూ వచ్చిందంటే అందులో దావన్‌తో పాటు పృథ్వీషా, పంత్‌, శ్రేయస్‌ అయ్యార్‌ పాత్ర కీలకం. ఆ నలుగురూ కలిసి.. 1,751 పరుగులు చేశారు. అయితే, ఆ తర్వత వచ్చే బ్యాట్స్‌మెన్‌ ఎవరూ రాణించడం లేదు. దిల్లీ బ్యాట్స్‌మెన్‌ అంతా తొందరపాటు షాట్లు ఆడి ఔటవుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ కూడా బాధ్యత తీసుకోకపోవంతో చేజారిపోయిన మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. వరుస వికెట్ల పతనం దిల్లీకి ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ ఇదే తరహా బ్యాటింగ్‌ చెన్నైతోనూ కొనసాగిస్తే చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం నల్లేరు మీద నడకలాంటిదేనని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దిల్లీ ఇప్పటికే ఎనిమిది సార్లు 15 పరుగుల లోపు మూడు వికెట్లు కోల్పోయింది. అవేంటో చూద్దాం..

పదికే మూడు..

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 19వ ఓవర్‌ సమయానికి 12 పరుగులు మాత్రమే కావాలి. అదేం పెద్ద కష్టం కాని ఛేదన. అప్పటికి దిల్లీ చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. అయితే కేవలం పది పరుగులు చేసేందుకు దిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. ఆఖర్లో కీమో పాల్‌ ఫోర్‌ కొట్టి దిల్లీని గెలిపించాడు. పాల్‌ స్థానంలో అమిత్‌ మిశ్రాగానీ, వేరే ఆటగాడు ఉండి ఉంటే దిల్లీ విజయం కష్టమయ్యేదే.

15 పరుగులకే 4 వికెట్లు..
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 186 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీషా భారీ అర్ధశతకంతో మంచి ఆరంభం ఇచ్చాడు. అయితే సాఫీగా సాగుతున్న దిల్లీ ఇన్నింగ్స్‌కు 18వ ఓవర్‌లో బ్రేక్‌ పడింది. అప్పటి వరకూ 170/2తో విజయం వైపు దూసుకెళుతున్న దిల్లీ వరుస వికెట్లు పడటంతో ఒక్కసారిగా కుదేలైంది. దీంతో సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌కు తెరలేసింది. ఆ ఓవర్‌లో రబాడా.. రసెల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేసి రాణించడంతో మ్యాచ్‌ దిల్లీ వశమైంది.

8 పరుగులకే 7 వికెట్లు..
మొహాలీ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. పంజాబ్‌ బౌలర్‌ సామ్‌ కరన్‌ హ్యాట్రిక్‌ వికెట్లతో విజృంభించడంతో దిల్లీ ఆఖరి 7 వికెట్లను ఎనిమిది పరుగుల తేడాతో కోల్పోయింది. 144/3తో పటిష్ఠ స్థితిలో ఉన్న దిల్లీ 152 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

7 పరుగులకే 4 వికెట్లు..
సొంతగడ్డపై చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ దిల్లీ క్యాపిటల్స్‌ వరుస వికెట్లు కోల్పోవడంతో మరో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 16వ ఓవర్‌లో 120/2తో దూసుకెళుతున్న దిల్లీ కనీసం 170 పరుగులు లక్ష్యం నిర్దేశించేలా కనిపించింది. ఆఖర్లో చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావో దెబ్బకు దిల్లీ 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర్లో కేవలం ఏడు పరుగులు చేసేందుకు నాలుగు వికెట్లు చేజార్చుకుంది. దీంతో ఆ మ్యాచ్‌లో ధోనీ సేన సునాయాసంగా విజయం సాధించింది.

ముంబయితో ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు..
ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఒకే మ్యాచ్‌లో రెండు సార్లు స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయింది. 49/0తో అదిరే అరంభం లభించినా.. ఆ తర్వాత 27 పరుగుల తేడాలో ఐదు వికెట్లు కోల్పోయి 76/5గా మారింది. ఆ తర్వాత కొద్దిగా నిలదొక్కుకునేలా కనిపించినా.. మళ్లీ వికెట్ల పతనం ప్రారంభించింది. ఆఖరి నాలుగు వికెట్లు 18 పరుగుల తేడాతో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లోనూ దిల్లీ ఓటమి తప్పలేదు.

మరోసారి చెన్నైతో..
180 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన దిల్లీ క్యాపిటల్స్‌ తొలి ఆరు ఓవర్లకే 52/1తో ఉంది. ఆ తర్వాత సీఎస్‌కే స్పిన్నర్ల దెబ్బకు తర్వాత 99 పరుగులకే  దుకాణం సర్దేసింది. ఈ మ్యాచ్‌లో దిల్లీ బ్యాట్స్‌మెన్‌ పిజ్జా డెలివరీ బాయ్స్‌లాగా పెవిలియన్‌కు క్యూ కట్టారంటూ విమర్శలు కూడా వచ్చాయి. వీటితో పాటు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. సన్‌ రైజర్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 10 పరుగులకు, లీగ్‌ మ్యాచ్‌లో 8 పరుగులకే  మూడేసి వికెట్లు కోల్పోవడం గమనార్హం.

akhilesh B Editor
Sorry! The Author has not filled his profile.
×
akhilesh B Editor
Sorry! The Author has not filled his profile.