అంతర్జాతీయం

దక్షిణాదిలో రాహుల్‌ పోటీ అక్కడి నుంచే

తిరువనంతపురం: కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈసారి లోక్‌ సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తారని కొన్ని రోజుల కిందట వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. రాహుల్‌ కేరళలోని వైనాడ్ నియోజవర్గం నుంచి లోక్‌ సభకు పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈవి షయాన్ని కేరళ కాంగ్రెస్‌ ఛీఫ్‌ ముల్లప్పల్లి రామచంద్రన్‌ శనివారం మీడియాకు తెలిపారు. వైనాడ్‌ నుంచి పోటీ చేసేందుకు రాహుల్‌ అంగీకరించారని రామచంద్రన్‌ పేర్కొన్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఇతర కాంగ్రెస్‌ నేతల కోరిక మేరకు రాహుల్‌ కర్ణాటక నుంచి పోటీ చేస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. గతవారంలో రాహుల్‌ ఆ రాష్ట్రంలో పర్యటించారు. అప్పుడు కన్నడ నాట కాంగ్రెస్‌ నేతలు ఇదే విషయాన్ని లేవనెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పట్టు నిలుపుకోవాలంటే ఉత్తరాదితో పాటు దక్షిణాది కూడా ముఖ్యమైందని భావించి రాహుల్‌ రెండు చోట్లా పోటీ చేస్తారని సమాచారం. ఇప్పటికే ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి అమేఠీలో భాజపా తరఫున కేంద్రమంత్రి స్మృతి ఇరానీ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఇంకా ప్రకటించని విషయం తెలిసిందే.