క్రీడలు

‘థ్రిల్లర్‌’: ఆహా..ఏం మ్యాచ్‌ అది!

అసలే ఆదివారం. అందులోనూ ఆసీస్‌తో మ్యాచ్‌. ఆటంకం కలిగిస్తాడనుకున్న వరుణుడు ఆ రోజు అలిసిపోయాడేమో. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ కోహ్లీ వెంటనే మేమే ముందు బ్యాటింగ్‌ చేస్తామంటూ ఫించ్‌తో సై అన్నాడు. కమిన్స్‌, స్టార్క్‌ పోటాపోటీగా గంటకు 145 కి.మీ. వేగంతో బంతులు విసిరారు. గబ్బర్‌, కోహ్లీ, పాండ్య అండతో 50 ఓవర్లకి స్కోరుబోర్డుపై 352 పరుగులు కనిపించాయి. అయినా గుండెల్లో ఏదో తెలియని అలజడి. ఆసీస్‌ జోరుకు లక్ష్యం సరిపోతుందా అని!

ఛేదనకు దిగిన ఆసీస్‌ సైతం భయం భయంగానే కనిపించింది. భువీ, బుమ్రా భయపెట్టే బంతుల ధాటికి వార్నర్‌, ఫించ్‌ దూకుడు తగ్గించారు. 9 ఓవర్లకి 29/0తో ఉన్న కంగారూలను చివరికి టీమిండియా 316 పరుగులకే చాపచుట్టేసింది. ‘వింటే రామాయణమే వినాలి.. తింటే గారెలే తినాలి. చూస్తే భారత్‌, ఆసీస్‌ మధ్య పోరే చూడాలన్నంత రీతిలో సాగిందా మ్యాచ్‌. ఆరంభం చప్పగా.. మధ్యలో జోరుగా.. చివర్లో హోరాహోరీగా సాగింది. మొత్తంగా 668 పరుగులు నమోదు కావడం అసాధారణం. మరి ఇంతలా సిసలైన క్రికెట్‌ మజా అందించిన ఈ ‘థ్రిల్లింగ్‌’ మ్యాచ్‌ ఎలా సాగిందో మరోసారి లుక్కేద్దాం..

కమిన్స్‌, స్టార్క్‌ కుమ్మేశారు‌..
ఒకరు గంటకు 140కిమీ వేగంతో.. మరోకరు 145కిమీ పైనే..! ఒకర్నిమించి మరొకరు దూసుకొచ్చే బంతులతో తొలి ఓవర్‌ నుంచే కమిన్స్‌, స్టార్క్‌ చెలరేగారు. అంతే తొలి ఓవర్‌కు రెండు.. 4 ఓవర్లకి 11 పరుగులు..  మిగతా బౌలర్లు కూడా ఇలాగే బౌలింగ్‌ చేస్తే ఎలా? భారీ స్కోరు సంగతి పక్కన పెడితే.. అసలు గౌరవప్రదమైన స్కోరైనా దక్కుతుందా? ఇలా ఒక్కో ప్రశ్న సగటు భారత అభిమాని మదిలో మొదలైంది. కానీ తర్వాతి గబ్బర్‌ గేర్‌ మార్చాడు. దూకుడు పెంచాడు. భారీ షాట్లతో ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రోహిత్‌ ఔటైనా.. అదే జోరు సాగించాడు. క్రీజులోకి వచ్చిన కోహ్లీ నిదానంగా కుదురుకుంటుంటే.. గబ్బర్‌ మాత్రం దూకుడు పెంచాడు. అదే ఊపులో శతకం కూడా బాదేశాడు. కానీ మరో 17 పరుగులకే స్టార్క్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. అప్పటికీ భారత్‌ స్కోరు 37 ఓవర్లకి 220/2.

ఫటాపట్‌ పాండ్య..
పాండ్య రాకతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మొత్తంగా మారిపోయింది. కౌల్టర్‌నైల్‌ బౌలింగ్‌లో తొలి బంతికే ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ పవర్‌ హిట్టర్‌.. తర్వాతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎదుర్కొన్న నాలుగో బంతికే బౌండరీ బాదిన పాండ్య పదో బంతిని భారీ సిక్సర్‌గా మలిచి చప్పగా సాగుతున్న ఇన్నింగ్‌కు ఓ ఊపు తీసుకొచ్చాడు. పాండ్య హిట్టింగ్‌ చూసి అవతలి ఎండ్‌లో ఉన్న కోహ్లీ సైతం సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో 27బంతులాడి 48 పరుగులు సాధించాడు. తర్వాత క్రీజులోకొచ్చిన ధోనీ మూడు బౌండరీలు, ఓ భారీ సిక్సర్‌తో 27 పరుగులు పిండుకున్నాడు. అయితే 49 ఓవర్‌లో స్టార్క్‌ మరోసారి రెచ్చిపోయాడు. ఆ ఓవర్‌లో 6 బంతులూ గంటకు 140 కిమీ పైగా వేగంతో విసిరాడు. అయినా ధోనీ ఓ సిక్స్‌, ఫోర్‌ సాధించి ఔరా అనిపించాడు. చివరి ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ బ్యాట్‌ ఝళిపించడంతో భారత్‌ 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే ప్రపంచకప్‌లో ఆసీస్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యుత్తమం కావడం ఇక్కడ విశేషం..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ను భువీ తొలి ఓవర్‌లోనే కట్టడి చేశాడు. ఆ ఓవర్‌లో కేవలం 3 పరుగులే వచ్చాయి. బుమ్రా కూడా బెంబేలెత్తించాడు. దీంతో 9ఓవర్లకి ఆసీస్‌ స్కోరు 29 పరుగులే. తర్వాత ఫించ్‌ దూకుడు పెంచినా 14 ఓవర్‌లో రనౌట్‌ అయ్యాడు. అప్పుడు వార్నర్‌తో జత కలిసిన స్మిత్‌ నిదానంగా క్రీజులో పాతుకుపోయాడు. ఒక్కో పరుగు చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. వార్నర్‌ (56) కాసేపటికి ఔటైనా స్మిత్‌ పోరాటం చూస్తుంటే భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. ఖవాజాతో కలిసి స్మిత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పరుగుల వేగం పెరిగింది. రన్‌రేట్‌ కూడా సాధారణంగానే కనిపిస్తోంది. కోహ్లీ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగాలు చేస్తున్నాడు. భారత్‌పై మెరుగైన రికార్డ్ ఉన్న స్మిత్ నెమ్మదిగా అర్ధశతకం సాధించాడు. చాహల్‌, కుల్దీప్‌, పాండ్య.. బౌలర్లు మారుతున్నారు. కానీ స్మిత్‌-ఖవాజా జోడీ ఇంకా క్రీజులోనే. ఓవర్‌కో బౌండరీ.. వీలైతే అప్పుడప్పుడో సిక్సర్‌. భారత ఆటగాళ్లలో ఆందోళన.. 36 ఓవర్లకి ఆసీస్‌ 201/2తో పటిష్ఠంగా ఉంది. అభిమానుల్లో నిరాశ మొదలైంది. బంతి బౌండరీకి చేరుకున్ప ప్రతిసారి కోహ్లీ మొహంలో అసంతృప్తి. ఆసీస్‌ గెలుపు పెద్ద కష్టమేమీ కాదు అనిపిస్తోంది. ఏం చేయాలి? ఈ జోడీని ఎలా విడగొట్టాలి? పరిస్థితి కూడా వారికే అనుకూలంగా మారింది. రెండో మ్యాచ్‌లో ఓటమి తప్పదా?

ప్పుడొచ్చాడు..
2011 ప్రపంచకప్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధోనీ బంతిని నేరుగా జహీర్‌ఖాన్‌కే ఇచ్చేవాడు. జహీర్‌ కూడా సారథి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెంటనే ఫలితం చూపించేవాడు. అలా ధోనీకి జహీర్‌ ఎలాగో.. ఈ ప్రపంచకప్‌లోనూ కోహ్లీకి బుమ్రా అలా కనిపించాడు. చెలరేగిపోతున్న ఖవాజాను చక్కటి బంతితో బోల్తా కొట్టించాడు. అంతే మైదానంలో భారత జెండా రెపరెపలాడింది. కానీ ప్రమాదకర మ్యాక్స్‌వెల్‌ క్రీజులోకి రావడంతో ఆనందం క్షణాల్లో మాయమైంది. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి పంపాడు మ్యాక్స్‌వెల్‌. తర్వాత భువీ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, బుమ్రా బౌలింగ్‌లో మరో మూడు ఫోర్లు.. ఇలా లక్ష్యం వేగంగా కరిగిపోతుంది. మ్యాచ్‌ ఉత్కంఠకు దారితీస్తోంది. మ్యాక్సీ ఇదే విధ్వంసం సాగిస్తే మ్యాచ్‌ చేజారినట్టేనా.. మళ్లీ ఇలాంటి ప్రశ్నలే పునరావృతం అవుతున్నాయి. మైదానంలోని అభిమానులు మూగబోయారు. అప్పుడు మెరిశాడు భువనేశ్వర్ కుమార్‌. 40 ఓవర్‌ నాలుగో బంతికి స్మిత్‌ ఎల్బీగా.. ఆఖరి బంతికి స్టోయినిస్‌ (0) బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ గమనాన్నే మార్చేశాడు. మరుసటి ఓవర్‌లో చాహల్‌ కూడా మ్యాక్స్‌వెల్‌ (28) లయ దెబ్బ తీసే బంతితో బోల్తా కొట్టించాడు. ఇక మిగిలింది తోకే. విజయం మనదే. కానీ అక్కడ ఉన్నది బలమైన ప్రత్యర్థి ఆసీస్‌. వికెట్‌కీపర్‌ అలెక్స్‌ కారీ ఒక్కసారిగా ఉప్పెనలా విరుచుకపడ్డాడు. బౌండరీ, సిక్సర్‌.. వీలైతే రెండు పరుగులు.. వామ్మో.. ఏమా బ్యాటింగ్‌. దంచికొట్టాడు. అతని దూకుడు చూస్తుంటే మ్యాచ్‌ పోయేలా కనిపించింది. అప్పుడు వ్యూహం పన్నిన కోహ్లీసేన కారీను ఒక ఎండ్‌కు పరిమితం చేసి.. నెమ్మదిగా తోక పనిపట్టేశారు. అంతే చేజారుతున్నట్లు కనిపించిన మ్యాచ్‌ కాస్త మళ్లీ భారత్‌ ఖాతాలోకే వచ్చి పడింది. చివర్లో ఉత్కంఠకు తెరపడింది.