జాతీయం

థియేటర్‌లో సినిమా చూసిన రాహుల్‌ గాంధీ

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగాలని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాహుల్‌ ఓ సామాన్యుడిలా దిల్లీలోని ఓ థియేటర్‌కి వెళ్లి ‘ఆర్టికల్‌ 15’ సినిమా  వీక్షించడం విశేషం. సాధారణ పౌరుడిలా సీట్లో కూర్చొని పాప్‌కార్న్‌ తింటూ పక్క సీట్లో వారితో కబుర్లు చెబుతూ ఆయన సరదాగా కనిపించారు. రాహుల్‌ సినిమా చూస్తున్న దృశ్యాలను అదే థియేటర్‌లో ఉన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో కొన్ని గంటల వ్యవధిలోనే ఇది వైరల్‌గా మారింది.

అయితే దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ‘ఎటువంటి హడావుడి లేకుండా ఓ సాధారణ పౌరుడిలా రాహుల్‌ సినిమా వీక్షించడం నిజంగా గొప్ప విషయం’ అని కొంతమంది ప్రశంసించారు. ‘ఓవైపు అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టాలని నేతలు తర్జనభర్జనలు పడుతుంటే మరోవైపు రాహుల్‌ తాపీగా రిలాక్స్‌ అవుతున్నారు’ అని మరికొంత మంది విమర్శించారు.