తెలంగాణ

తెలంగాణలో డిసెంబర్‌ 7న పోలింగ్‌..!

స్నేహ, న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌పై సస్పెన్స్‌కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. రాజస్థాన్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలో డిసెంబర్‌ ఏడో తేదీన పోలింగ్‌ జరగనుం‍ది. ఈ మేరకు తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ ఖరారుపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో ఓటర్ల జాబితాను ప్రకటించడానికి ఇంకా సమయం ఉందని, ఈ నెల 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించాలని భావించినప్పటికీ.. ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓపీ రావత్‌ స్పష్టం చేశారు. అయితే, రాజస్థాన్‌తోపాటే అనూహ్యంగా ఆయన తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు.

తెలంగాణ, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ ఈ విధంగా ఉంది..

  • నవంబర్ 12న నోటిఫికేషన్‌ వెలువడనుంది..
  • నామినేషన్లు దాఖలు చివరి తేదీ : నవంబర్ 19
  • నామినేషన్ల పరిశీలన : నవంబర్ 20
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ : నవంబర్ 22
  • పోలింగ్: డిసెంబర్ 7
  • కౌంటింగ్: డిసెంబర్ 11

ఓ కేసులో పెండింగ్‌లో ఉంది..
తెలంగాణలో ఎన్నికల జాబితాకు సంబంధించి ఓ కేసు పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, ఓటర్ల తుది జాబితాను ఖరారు కాగానే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని రావత్‌ వెల్లడించారు. ఈ నెల 12వ తేదీలోగా ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసేందుకు కొంత సమయం పట్టవచ్చునని ఆయన చెప్పారు.