క్రైమ్

తాళ్లతో కట్టి, మోకాళ్లపై కూర్చోబెట్టి..

ఎన్ని చట్టాలు చేసిన మూకదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గోవులను అక్రమంగా తరలిస్తున్నారన్న నెపంతో 24 మందిపై మూక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో 20 గోవులను మహారాష్ట్రకు తరలిస్తున్నారు. సావాలైకెద గ్రామ సమీపానికి వారి వాహనశ్రేణి చేరగానే  గమనించిన గో సంరక్షణ సమితి సభ్యులు సూమారు 100 మంది వారిని ఆపారు. గోవులను తరలిస్తున్న వారిలో 15 మందిని తాళ్లతో బంధించి వీధుల వెంట తిప్పారు. వారితో ‘గో మాతకి జై’ అనే నినాదాన్ని బలవంతంగా చేయించారు. అందరూ చూస్తుండగా వారిని మోకాళ్లపై రోడ్డుమీద కూర్చోబెట్టి, చొక్కాలు విప్పించారు, ఆపై భౌతిక దాడి చేశారు. ఈ దృశ్యాలను మొబైల్‌ ఫోన్లతో చిత్రీకరించడం విశేషం. వాళ్లను తీసుకెళ్లి ఆ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాల్వా పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. దీనిపై జిల్లా పోలీసాధికారి శివదయాళ్‌ సింగ్‌ వివరణ ఇస్తూ.. గోవులను తరలిస్తున్న వ్యక్తులను వివరాల అడుగ్గా, వాటిని తాము కోనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్తునట్టుగా తెలిపారు. కానీ వారి వద్ద దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు లేవు. దాంతో వారిపై మధ్యప్రదేశ్‌ గోవంశ్‌ వధ్‌ పరిషత్‌, జంతు సంరక్షణ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి అదుపులోకి  తీసుకున్నామని పేర్కొన్నారు. అయతే వీరిపై దాడి చేసిన గో సంరక్షణ సమితి సభ్యులు మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గోవులను తరలించే ఆ 24 మంది ఖాండ్వా, సెహోర్‌, హార్థ జిల్లాలకు చెందినవారు. వీరిలో నలుగురు ముస్లింలు కూడా ఉన్నారు. పోలీసులు వీడియోలను పరిశీలించారు. దీనినే ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించనున్నారు.
దాడుల నియంత్రణకు ప్రత్యేక బిల్లు
రేపటినుంచి మధ్యప్రదేశ్‌లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశంలో గో సంరక్షణ పేరిట దాడులు చేసేవవారిని నిలువరించేందుకు ఒక బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఇది పాసైతే ఇలాంటి దాడులకు పాల్పడిన వారికి ఆరునెలల నుంచి ఐదేళ్లు వరకు జైలు శిక్ష, రూ.50000 జరిమానా విధించనున్నారు.