అంతర్జాతీయం

తప్పు చేయకుంటే భయమెందుకు: జైట్లీ

న్యూదిల్లీ: కర్ణాటకలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఐటీ కార్యాలయాల ముందు చేసిన నిరసనలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ తీవ్రంగా విమర్శించారు. ఆ నిరసనలకు వారు చేసిన అవినీతే ఒక కారణమని లేకుంటే వారు భయపడాల్సిన అవసరమేముందని అన్నారు. ఈ సోదాల వెనుక ఎటువంటి రాజకీయ ప్రోద్భలం లేదని చెప్పారు. అయినా వారు భయపడుతున్నారంటే కచ్చితంగా అవినీతికి పాల్పడే ఉంటారన్నారు. ‘రాష్ట్రాల సమాఖ్య భారతదేశం. ఆ రాష్ట్రాలపై కేంద్రానికి కొన్ని అధికారాలు ఉంటాయి. వాటిలో దేశ భద్రత, దేశ గౌరవాన్ని కాపాడటం, ఉగ్రవాదాన్ని అణిచివేయడం, సరిహద్దులను కాపాడుకోవడం, అక్రమార్కులు ఏ మార్గంలోనూ దేశంలోకి చొరబడకుండా చూడటం, ఆదాయపు పన్ను వంటి ఎన్నో అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. వాటికి రాష్ట్రాలు అడ్డు తగలడం అంటే సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగించడమే. ఈ విధానాలతో ప్రజల నుంచి సానుభూతి పొందాలనుకోవడం తగదు. కర్ణాటకలో జరిగిన దాడులు పబ్లిక్‌ వర్క్స్‌కి సంబంధించినవి. అక్కడ కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు అంతా కుమ్మక్కైనట్లు సమాచారం అందింది. కొంతమంది కలెక్టింగ్‌ ఏజెంట్లుగా మారిపోయారు. ఈ ఏజెంట్లు కొంతమంది నాయకుల కింద పనిచేస్తున్నారు. నేడు ఆ నాయకుల్లో కొందరు నిరసనలకు దిగిన వారిలో ఉన్నారు. ప్రజల సొమ్మును పాలకులే కాంట్రాక్టర్లకు ఇచ్చి, అక్కడి నుంచి మళ్లీ వారి దగ్గరికే వచ్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలు చేస్తున్నవారే నేడు సమాఖ్య స్ఫూర్తిపై నిరసనలు వ్యక్తం చేసి సానుభూతి పొందాలని చూస్తున్నార’ని అన్నారు.
కర్ణాటకలో అధికారంలో ఉన్న తమ పార్టీ నేతల ఇళ్లపై ఉద్దేశపూర్వకంగా ఐటీ దాడులు చేస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో ప్రధాని మోదీ, అమిత్‌ షా కూడా భాగస్వాములేనని ఆరోపించారు. భాజపా, మోదీ పాలన నియంత పాలనను తలపిస్తుందని దాడుల సందర్భంగా ఆయన అన్నారు.