తెలంగాణ

తనకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదు..

  • గోదావరి జలాల సాధనకే పోటీ
  • ఎమ్మెల్యేలు ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు
  • కేసీఆర్‌ నన్ను వాడుకుంటే 12సీట్లు చేతిలో పెడతా
  • బాబును నమ్ముకుని మోసపోయా
  • యాదగిరిగుట్ట శంఖారావ సభలో..
  • మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
యాదాద్రి: తనకు ఎమ్మెల్యే పదవి కొత్త కాదని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనను ఆదరించి న ఆలేరు ప్రజలకు గోదావరి జలాలు, రిజర్వాయర్ల సాధనకే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. గురువారం ఆయన యాదగిరిగుట్టలో నిర్వహించిన శంఖారావ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తాను 25ఏళ్ల వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ఎన్టీఆర్‌ ఆశీస్సులతో మంత్రినయ్యానని, కానీ చంద్రబాబు వంటి మోసకారిని నమ్ముకుని నష్టపోయి నడిరోడ్డున నిలబడ్డానని పేర్కొన్నారు.
తాను వ్యాపారిని కాదు.. రియల్‌ఎస్టేట్‌ దళారిని కాదు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేశానని గుర్తుచేశారు. నియోజకవర్గం పక్కనేగల తపా్‌సపల్లి నీళ్లు దిగువకు కాదని, ఎగువకు తీసుకుపోతుంటే అడిగే నాధుడు లేక ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. తానైతే ఆ విధంగా నీళ్లను తరలించుకు పోనిచ్చేవాడినా అని ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా సాధనకు పోరాడి కేసీఆర్‌ను ఒప్పించానన్నారు. ఈసారి ఎన్నికల్లో మీ కోసం పనిచేసే వారికే ఓటు వేయాలని సూచించారు. ఆలేరు ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి గోదావరి జలాలు తీసుకొస్తానన్నారు. జనగామలో కలిసిన గుండాలని తిరిగి యాదాద్రి జిల్లాలో విలీనం చేపిస్తానని హామీనిచ్చారు.
నన్ను వాడుకుంటే.. 12సీట్లు ఇస్తా ..
కేసీఆర్‌ మిత్రుడు.. ఎన్నికల్లో తనను వాడుకుంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12సీట్లు గెలిపించి చేతిలో పెడుతానని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మకుంటే మోసం చేశాడన్నారు. పార్టీలో తాను కేసీఆర్‌ కోసమే మాట్లాడానని, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు వద్దని చెప్పానని పేర్కొన్నారు. అప్పుడు రాజకీయంగానే టీఆర్‌ఎ్‌సను వ్యతిరేకించానే తప్ప.. తాను కేసీఆర్‌కు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. టీడీపీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని.. అందరికి ఇచ్చేపార్టీగా చరిత్రగలది ప్రస్తుతం అడుక్కునే పార్టీగా మారిందని విమర్శించారు. ఇందుకు చంద్రబాబే కారణమని ఽఆయనపై తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. సభలో భార్య డాక్టర్‌ యశోదతో పాటు కూతురు, అల్లుడు, మనమడిని ప్రజలకు పరిచయం చేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఆయన మద్దతుదారులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం యాదగిరిగుట్ట మాజీ సర్పంచ్‌ కైరంకొండ శ్రీదేవి, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ గజం ఉప్పలయ్య, దడిగె ఇస్తారి, బీసీ సంఘం నాయకులు ఉప్పలయ్య, ఎమ్మార్పీఎస్‌ నాయకులు డేనియల్‌, వివిధ మండలాలకు చెందిన నాయకులు ఆంజనేయు లు, చలిమాల చంద్రారెడ్డి, గుంటి మధుసూదన్‌రెడ్డి, రాంమూర్తి, ఆత్మకూర్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి తదితరులు ప్రసంగించి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న మోత్కుపల్లికి సంపూర్ణమద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు గిరెడ్డి ముకుందరెడ్డి, తుర్కపల్లి మాజీ ఎంపీపీ ఉప్పలయ్య, కైరంకొండ శ్రీదేవి, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు మేడి పాపయ్య, మంద శంకర్‌, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు వెంకన్న, చంద్రారెడ్డి, కె. ఆంజనేయులు, అమరేందర్‌, మధుసూధన్‌రెడ్డి, శ్రీరాంమూర్తి, లక్ష్మీనారాయణ, కందుల మల్లేశం,రాజేశ్వర్‌, నరహరి, మల్లేశం, భిక్షపతి పాల్గొన్నారు.