సినిమా

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కు సారీ చెప్పిన రాశీ ఖన్నా

హైదరాబాద్‌: ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌కి సినీ నటి రాశీ ఖన్నా క్షమాపణలు చెప్పారు. ఆమె కథానాయికగా విశాల్‌కు జోడీగా నటించిన ‘అయోగ్య’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాశీకి రవీనా అనే యువతి డబ్బింగ్‌ చెప్పారు. అయితే సినిమా క్రెడిట్స్‌లో రవీనా పేరును జోడించలేదు. దాంతో ట్విటర్‌ వేదికగా రవీనా తన బాధను వ్యక్తపరిచారు.

‘అయోగ్య సినిమా పూర్తయ్యాక పడే టైటిల్స్‌లో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌లకు క్రెడిట్స్‌ ఇవ్వలేదు. షూటింగ్‌లో ఉన్న డ్రైవర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, సౌండ్‌ ఇంజినీర్లు, స్టూడియో కో-ఆర్డినేటర్‌ల పేర్లు క్రెడిట్స్‌లో పేర్కొన్నందుకు సంతోషంగా ఉంది. కానీ మా కేటగిరీ (డబ్బింగ్‌)ని పట్టించుకోనందుకు బాధగా ఉంది’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇందుకు రాశీ ఖన్నా స్పందిస్తూ.. ‘గుర్తించనందుకు సారీ రవీనా. కానీ, నీ మధురమైన స్వరాన్ని అరువిచ్చి నా పాత్రను మరింత అందంగా మలచినందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు. దీనికి రవీనా ప్రతిస్పందిస్తూ.. ‘ధన్యవాదాలు రాశీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్‌ చేశారు.  తెలుగులో ఎన్టీఆర్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘టెంపర్‌’కు ‘అయోగ్య’ రీమేక్‌గా వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.