జాతీయం

టీమిండియా బౌలింగ్‌తో జాగ్రత్త!

ముంబయి: మరో రెండు వారాల్లో ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఎంపిక చేసిన భారత జట్టులో మంచి బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు కానీ, జట్టును బౌలర్ల ఫామ్‌ వేధిస్తోంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కుల్‌దీప్ యాదవ్‌ ఫామ్‌ కోల్పోయాడు. షమీ కూడా మునుపటిలా ఆకట్టుకోలేదు. ప్రపంచకప్‌ జట్టులో వీరిద్దరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగాటోర్నీ ముంగిట టీమిండియా బౌలర్ల ఫామ్‌పై వస్తున్న విమర్శలపై భువి స్పందించాడు.

‘ఇంగ్లాండ్‌లో కొన్నాళ్లుగా పిచ్‌ చాలా ఫ్లాట్‌గా ఉంది. కానీ ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్లన్నీ టీమిండియా బౌలింగ్‌ యూనిట్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్నాళ్లుగా భారత జట్టు బౌలర్ల పనితీరే ఇందుకు నిదర్శనం. రోజు రోజుకూ జట్టు బౌలింగ్‌ దృఢమవుతోంది. ఎలాంటి పిచ్‌ మీదయినా ఇండియన్‌ పేసర్లు రాణించగలరు. జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌ల బౌలింగ్‌ తీరు ఎలాంటిదో అన్ని జట్లకూ ఇప్పటికే అవగాహన ఏర్పడి ఉంటుంది. నేను కూడా నా సామర్థ్యం మేరకు ప్రపంచ కప్‌లో రాణిస్తానని నమ్ముతున్నాను’ అని తెలిపాడు.